ఈశాన్యభారతంలోని మేఘాలయలో మొట్టమొదటి రాష్ట్ర విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం జనవరి 13న జరగబోతోంది. ఆ సందర్భంగా అక్కడ భారీ క్రైస్తవ ప్రార్థన నిర్వహించడానికి మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ సందర్భంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి.
మేఘాలయలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం కెప్టెన్ విలియంసన్ సంగ్మా యూనివర్సిటీ ఆవిష్కరణ జనవరి 13న నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా కూటమి ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని రాష్ట్రంలోని పలు వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆ నేపథ్యంలో మేఘాలయ విద్యాశాఖ మంత్రి రక్కమ్ ఎ సంగ్మా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత ముదిరేలా చేసాయి.
‘‘2023 మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. మేఘాలయ ఒక క్రైస్తవ రాష్ట్రం కాబట్టి మా మొదటి రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని క్రైస్తవ ప్రార్థనా కూటమితో ప్రారంభించాలని మేం కోరుకుంటున్నాం. పార్లమెంటును హిందూ సంప్రదాయ పద్ధతుల్లో ఆశీర్వదించగా లేనిది, క్రైస్తవ రాష్ట్రంలో క్రైస్తవ పద్ధతులు ఎందుకు పాటించకూడదు?’’ అని రక్కమ్ సంగ్మా అన్నారు.
రాష్ట్రప్రభుత్వ నిర్ణయంపై మేఘాలయ స్థానిక దేశీయ విశ్వాసాలకు చెందిన వర్గం ‘సెయిన్రెజ్ జోవై’ తీవ్రంగా స్పందించింది. ‘‘2025 జనవరి 13న విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా క్రైస్తవ ప్రార్థనా కూటమి ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికల గురించి విద్యాశాఖ మంత్రి రక్కం ఎ సంగ్మా ప్రకటన ద్వారా తెలిసాక మేము మోసపోయినట్లుగా భావిస్తున్నాము. విస్తృత వైవిధ్యం కలిగిన భారతదేశపు రాజ్యాంగాన్ని మంత్రి ప్రకటన దెబ్బతీసింది. మేఘాలయ ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి నుంచి వచ్చిన ఆ ప్రకటన ప్రశాంతమైన రాష్ట్రంలో మతపరమైన విభజన తెచ్చే ప్రయత్నం చేస్తోంది. భారత రాజ్యాంగంలోని 25, 26 అధికరణాలు అందించిన మతస్వేచ్ఛ హక్కుకు విఘాతం కలిగిస్తోంది. క్రైస్తవ ప్రార్థనా కూటమి నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని సెయిన్రెజ్ జోవై తీవ్రంగా ఖండిస్తోంది’’ అని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
మేఘాలయను క్రైస్తవ రాష్ట్రంగా ప్రకటించేముందు ఆ ప్రాంతపు చరిత్రను, వాస్తవాలనూ అర్ధం చేసుకోవాలని సెయిన్రెజ్ జోవై సంస్థ కోరింది. ‘‘బ్రిటిష్ వారికి ముందు మేఘాలయలో దేశీయ విశ్వాసాలు ఉండేవి తప్ప మరే ఇతర మతమూ లేదు. ఇవాళ్టికీ మేము మా పూర్వీకులు మాకు అందించిన సంప్రదాయాన్ని, సంస్కృతినీ, విశ్వాసాన్నీ రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రాంతానికే సొంతమైన పద్ధతులను తుడిచిపెట్టేసేందుకు వివిధ మార్గాల్లో బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా అస్తిత్వానికి సవాళ్ళు ఎదురవుతున్నాయి. మేఘాలయకే ప్రత్యేకమైన పండుగలను దేశీయ విశ్వాసులం జరుపుకుంటామన్న సంగతిని ప్రభుత్వం కాదనలేదు. కాబట్టి మేఘాలయ క్రైస్తవ రాష్ట్రం అన్న పదం మా ఉనికిని, అస్తిత్వాన్నీ అవమానించడమే’’ అని సెయిన్రెజ్ జోవై సంస్థ ప్రకటించింది.
‘‘విశ్వాసం, ఆరాధనల్లో స్వతంత్రం అనేది మతస్వేచ్ఛకు మార్గదర్శకం. అయితే ఏదైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని మతపరంగా నిర్వహించడం, ఆఖరికి కార్యాలయ భవనాలను మతపరంగా అలంకరించడం, ఒక ప్రత్యేక మతపు వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో నిర్వహించడం మతస్వాతంత్ర్యపు హక్కును ఉల్లంఘించడమే, వారి గర్వాన్ని ప్రదర్శించడమే. ఆ నేపథ్యంలో జనవరి 13న కెప్టెన్ విలియంసన్ సంగ్మా స్టేట్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో భారీ క్రైస్తవ ప్రార్థనా కూటమిని నిర్వహించాలన్న రాష్ట్రప్రభుత్వ యోచనను సెయిన్రెజ్ జోవై తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, మా ఉనికిని గుర్తించాలి. మా గిరిజన తెగలు మా సొంత సంస్కృతిని, సంప్రదాయాలను, మతాన్నీ కాపాడుకునే ప్రయత్నం చేయడాన్ని గౌరవించాలి. అదే మతసామరస్యానికి మంచిది. దేశంలోని, రాష్ట్రంలోని వేర్వేరు మతాల ప్రజల మధ్య పరస్పర గౌరవానికి మంచిది’’ అని సెయిన్రెజ్ జోవై సంస్థ అధ్యక్షుడు హెర్క్యులెస్ టోయ్, కార్యదర్శి అర్వోత్కీ సుమేర్ తమ ప్రకటనలో వెల్లడించారు.