కేరళలోని మునంబం ప్రాంతంలో వక్ఫ్ భూమి వివాదాన్ని మదింపు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ సిఎన్ రామచంద్రన్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ జనవరి 4న పర్యటించింది. దశాబ్దాలుగా తమ భూముల యాజమాన్య హక్కుల మీద అనిశ్చితిలో బతుకుతున్న వందలాది కుటుంబాల్లో ఆ పర్యటన ఆశలు రేకెత్తించింది.
కమిషన్ తొలుత మునంబంలోని పరిస్థితిని సమగ్రంగా మదింపు చేయడంతో తమ పర్యటనను ప్రారంభించింది. వివాదాస్పద ఆస్తులను, సముద్రపు కోత వల్ల దెబ్బతిన్న ప్రాంతాలనూ సందర్శించింది. మునంబం భూమి రక్షణ కౌన్సిల్‌కు చెందిన మహిళలు న్యాయం కోరుతూ 80 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ధర్నా శిబిరానికి కూడా జస్టిస్ రామచంద్రన్ వెళ్ళారు.
కమిషన్ బాధితులతో మాట్లాడింది, వారి సమస్యలు తెలుసుకుంది. వారందరి సమస్యా ప్రధానంగా ఒకటే. తమ తమ భూములను వక్ఫ్ బోర్డు తన సొంతమని ప్రకటించుకోవడం వల్ల ఎదురవుతున్న పరిణామాలు. దాంతో వారి జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. ఆ కుటుంబాలు తమ భూములను అమ్ముకోలేకపోతున్నాయి, లేదా తనఖా పెట్టుకోలేకపోతున్నాయి, దానివల్ల వారికి ఋణాలు పొందే అవకాశం లేకుండా పోయింది. డబ్బులు లేకపోవడంతో పిల్లల ఉన్నత విద్యాభ్యాసాలు ఆగిపోయాయి, పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయి. చివరికి ఇళ్ళు చిన్నచిన్న రిపేర్లు చేయించుకోడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఆస్తి యాజమాన్యంపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపు ఉచిత ఇళ్ళ పథకాల కింద నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా పోయింది.
సమస్య చాలా సంక్లిష్టంగా ఉందని జస్టిస్ రామచంద్రన్ గుర్తించారు. చట్టబద్ధంగా భూములు కొనుగోలు చేసిన వారి కేసులను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరముందని చెప్పారు. ఈ వివాదంలో ప్రధాన భాగస్వాములైన కేరళ వక్ఫ్ బోర్డ్, ఫరూఖ్ కాలేజ్ ట్రస్ట్ వారి వాదనలు కూడా కమిషన్ విననుంది.
మునంబం అనేది కేరళలో సముద్ర తీరాన ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ ప్రజలు ఐదారు దశాబ్దాల క్రితం భూములు కొనుక్కుని ఇళ్ళు కట్టుకుని జీవిస్తుండగా, ఆ ఆస్తులన్నీ తమవేనంటే కేరళ వక్ఫ్ బోర్డ్ ప్రకటించింది. దాంతో సమస్య మొదలైంది.
ఆ ప్రాంతంలో చాలా కుటుంబాలు ఎన్నో దశాబ్దాలుగా జీవిస్తున్నాయని, కొన్ని ప్రాంతాలు సముద్రపు కోతకు కూడా గురయ్యాయనీ జస్టిస్ రామచంద్రన్ నిర్ధారించుకున్నారు. కమిషన్ హియరింగ్‌లు జనవరి 10 నుంచీ మొదలవుతాయి. కమిషన్ తన నివేదికను ప్రభుత్వ వర్గాలకు ఫిబ్రవరిలో సమర్పిస్తుంది.