దేశానికి స్వతంత్ర వచ్చేనాటికి ఉనికిలో ఉన్న మత ప్రదేశాల స్వభావాన్ని యథాతథంగా ఉంచాలంటూ పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రార్థనా స్థలాల చట్టం 1991 చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన కేసుల్లో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారతీయ సంత్ సమితి అనే హిందూ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దేశ పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన సమానత్వపు హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించుకునే హక్కు సహా పలు ప్రాథమిక హక్కులను ప్రార్థనాస్థలాల చట్టం 1991లోని 3,4 సెక్షన్లు ఉల్లంఘిస్తున్నాయంటూ ఆ పిటిషన్‌లో ఆరోపించారు.
ప్రార్థనా స్థలాలకు సంబంధించిన వివాదాలను న్యాయస్థానాలు సమీక్షించకుండా ఆ చట్టం నిలిపివేయడం ద్వారా న్యాయస్థానాల అధికారాలను తగ్గించివేసిందని, అది రాజ్యాంగపు మౌలిక నిర్మాణానికే విరుద్ధమనీ సంత్ సమితి ఆరోపించింది.
దేశంలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న మతపరమైన కట్టడాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దావాల్లో ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయవద్దంటూ సుప్రీంకోర్టు 2024 డిసెంబర్ 12న దేశంలోని అన్ని న్యాయస్థానాలకూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు, తుది ఉత్తర్వులు లేదా సర్వే ఆదేశాలు ఏవీ జారీ చేయరాదంటూ దిగువ కోర్టులను ఆదేశించింది. అంతే కాకుండా ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాల్ చేస్తున్న పిటిషన్లను విచారిస్తున్న తరుణంలో అటువంటి ఆరోపణల మీద కొత్త దావాలను రిజిస్టర్ చేయవద్దని కూడా ఆదేశించింది. ఆ చట్టం మీద కేంద్రప్రభుత్వ వైఖరిని నాలుగు వారాల్లో తెలియజేయాలని కూడా కోరింది.
సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా వివిధ కోర్టుల్లో ప్రార్థనా స్థలాలకు సంబంధించిన వివాదాల మీద సుమారు 18 దావాల ప్రొసీడింగ్స్ నిలిచిపోయాయి.
కాశీ రాజకుటుంబం వారసురాలు మహారాజా కుమారి కృష్ణప్రియ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, మాజీ ఎంపీ చింతామణి మాలవీయ, రిటైర్డ్ ఆర్మీ అధికారి అనిల్ కబోత్రా, న్యాయవాది చంద్రశేఖర్, వారణాసి నివాసి రుద్ర విక్రమ్ సింగ్, ధార్మిక గురువు స్వామీ జితేంద్రానంద సరస్వతి, మథుర నివాసి, ధార్మిక గురవు అయిన దేవకీనందన్ ఠాకూర్, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ తదితరులు ప్రార్థనాస్థలాల చట్టం 1991కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు.
విదేశీ ఆక్రమణకారులు ధ్వంసం చేసిన హిందూ, జైన, బౌద్ధ, సిఖ్ఖు ప్రార్థనా స్థలాలు, పుణ్యక్షేత్రాలను ఆయా మతాల వారు పునరుద్ధరించుకోడానికి వారికుండే హక్కులను లాగేసుకుంటోందని ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ పిటిషన్లు దాఖలయ్యాయి.
ముస్లిముల పక్షం నుంచి జమియాత్ ఉలేమా ఎ హింద్, ఇండియా ముస్లిం పెర్సనల్ లా బోర్డ్, కాశీ జ్ఞానవాపి కాంప్లెక్స్‌లోని మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మజీద్ మేనేజ్‌మెంట్ కమిటీ, మథుర కృష్ణజన్మభూమిలోని షాహీ ఈద్గా మసీదు కమిటీ తదితరులు…. ప్రార్థనా స్థలాల చట్టం 1991 చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసాయి. ఆ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లను అనుమతిస్తే దేశవ్యాప్తంగా లెక్కపెట్టలేనన్ని మసీదులకు వ్యతిరేకంగా దావాలు దాఖలవుతాయని, అందువల్ల 1991 చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ డిస్మిస్ చేసేయాలనీ వారి వాదన.
హిందూ పిటిషనర్ల వాదనేంటంటే… ‘‘1991 చట్టం రామజన్మభూమిని మినహాయించింది కానీ కృష్ణజన్మభూమిని మినహాయించలేదు. రామకృష్ణులు ఇద్దరూ విష్ణుమూర్తి అవతారాలే, ప్రపంచమంతటా వారిద్దరినీ సమానంగా పూజిస్తారు. ఇంక ఆ చట్టంలోని 2,3,4 సెక్షన్లు లౌకికవాద నియమాలను ఉల్లంఘిస్తున్నాయి. రాజ్యాంగపు మౌలిక నిర్మాణానికీ, రాజ్యాంగ ప్రవేశికలో అంతర్భాగమైన ‘రూల్ ఆఫ్ లా’కూ వ్యతిరేకంగా ఉన్నాయి. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కును, తద్వారా న్యాయస్థానాల్లో పరిష్కారం పొందే హక్కునూ ఆ చట్టం లాగేసుకుంది’’.
ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్ 3 ప్రార్థనా స్థలాల మార్పిడిని నిషేధిస్తోంది. ‘‘ఏదైనా మతానికి, మతశాఖకూ సంబంధించిన ఏదైనా ప్రార్థనా స్థలాన్ని మరొక మతానికి లేదా అదే మతానికి చెందిన వేరే శాఖకూ లేదా వేరే మతశాఖకూ సంబంధించిన ప్రార్థనాస్థలంగా ఏ వ్యక్తీ మార్చకూడదు’’ అని ఆ సెక్షన్ చెబుతుంది.
ఇక ఏదైనా ప్రార్థనా స్థలపు మతస్వభావాన్ని 1947 ఆగస్టు 15నాటికి ఉన్నది ఉన్నదాన్ని మరోలా మార్చడానికి ఎలాంటి దావా దాఖలు చేయకూడదు, మరే ఇతర చట్టపరమైన ప్రొసీడింగ్స్ ప్రారంభించకూడదు అని సెక్షన్ 4 చెబుతుంది.