340 అడుగుల లోతులో 15 మంది కార్మికులు
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఒకరి మృతదేహం వెలికితీత
అస్సాంలోని డిమా హసావోలోని బొగ్గు గని వద్ద సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గనిలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో నీరు ప్రవేశించింది. దీంతో సుమారు 15 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా సహాయ చర్యలు చేపట్టాయి.
గనిలోకి 21 మంది పారా డ్రైవర్లు వెళ్ళి గాలింపు చర్యలు చేపట్టారు. గని దిగువ నుంచి ఓ మృతదేహాన్ని తీసుకువచ్చారు. నేవీ, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
విశాఖపట్టణంకు చెందిన డైవర్లు ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయచర్యల్లో సేవలు అందించనున్నారు. మరోవైపు కుంభీగ్రామ్ నుంచి కూడా ఎంఐ17 హెలికాప్టర్ ద్వారా ఓఎన్జీసీ వాటర్ పైపులు తీసుకు వచ్చి నీటిని తోడేందుకు సిద్ధమయ్యారు.
ప్రమాదం గురించి కేంద్ర గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివరించారు. దీంతో సహాయ చర్యల్లో పాల్గొనేందుకు కోల్ ఇండియాకు చెందిన సిబ్బందిని పంపనున్నట్లు మంత్రి తెలిపారు.
సుమారు 340 ఫీట్ల లోతులో కార్మికులు చిక్కుకోగా నీరు వంద అడుగులకు చేరుకుంది. గనిలో అక్రమ తవ్వకాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఎన్డీఆర్ఎఫ్ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ హెచ్పీఎస్ ఖాన్‌దారి ఆధ్వర్యంలో సహాయ చర్యలు జరుగుతున్నాయి. తమ సిబ్బంది మంగళవారం నాడు కార్మికులను చేరుకునేందుకు ప్రయత్నించారని, కానీ అవరోధాలు ఎదురయ్యాయని తెలిపారు. నేడు జాయింట్ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిందన్నారు.