ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని రాజ్‌ఘాట్ కాంప్లెక్స్ పరిధిలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో భూమిని కేటాయించింది. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తెలిపారు.
పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎల్‌అండ్‌డిఓ) నుంచి అందిన సంబంధిత పత్రాన్ని ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్లతో పంచుకున్నారు. తన తండ్రి సేవలను గుర్తించి గౌరవించిన కేంద్రప్రభుత్వానికి శర్మిష్ట ధన్యవాదులు తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగినది అన్నారు.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ కీలక పదవుల్లో పనిచేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కేంద్రప్రభుత్వం 2019లో దేశ అత్యున్నత పురస్కారం ‘‘భారతరత్న’’తో సత్కరించింది. 2020 ఆగస్టులో ప్రణబ్ ముఖర్జీ మరణించారు.
తన తండ్రి విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై శర్మిష్ట ముఖర్జీ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తో ప్రణబ్ కు దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ, సంతాప తీర్మానాన్ని ఆమోదించడానికి అధికారిక సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆమె ప్రశ్నించారు.
రాష్ట్రపతిగా పనిచేసిన కేఆర్ నారాయణన్‌కు సంతాప సభ నిర్వహించినప్పుడు లేని నిబంధనలు ప్రణబ్ విషయంలో ఎందుకు ఉత్పన్నమయ్యాయని నిలదీశారు.