టిబెట్‌ను ఈ ఉదయం కుదిపేసిన భారీ భూకంపం ప్రభావంతో 95మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఆ భూకంపం వల్ల సుమారు 130 మంది గాయపడ్డారు. భారతదేశంలో కూడా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
భూకంపకేంద్రం షిగాత్సే సమీపంలోని తింగ్రీ కౌంటీలో గుర్తించారు. తింగ్రీ కౌంటీ టిబెట్ రాజధాని లాసాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో నేపాల్ సరిహద్దుల్లో ఉంది. ఎవరెస్ట్ శిఖరాన్ని దర్శించుకునే వారికి తింగ్రీ ఒక ప్రముఖ పర్యాటక స్థలం.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వివరాల ప్రకారం భూకంపం ఈ ఉదయం 6.35 గంటలకు చోటు చేసుకుంది. మొదటి భూకంపం తర్వాత మరికొద్దిసేపటికే మరో రెండు భూకంపాలు కూడా ఆ ప్రదేశాన్ని కుదిపేసాయి. మొదటి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదయింది. అయితే అమెరికాకు చెందిన జియొలాజికల్ సర్వీస్ మాత్రం భూకంప తీవ్రతను 7.1గా నమోదు చేసింది. రెండో భూకంపం 4.7 తీవ్రతతోను, మూడో భూకంపం 4.9 తీవ్రతతో నమోదయ్యాయి.
నేపాల్ ఉన్న ప్రాంతం… భూమి లోపల ఇండియన్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టే ప్రదేశం. అలాంటి భౌగోళిక చర్య వల్లనే లక్షల సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఆ ప్రాంతంలో తరచుగా భూకంపాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. 2015లో నేపాల్‌లో వచ్చిన భూకంపం సుమారు 9వేల మందిని బలి తీసుకుంది, 22వేల మందికి పైగా గాయాల పాలయ్యారు. సుమారు 5లక్షల ఇళ్ళు నేలమట్టమయ్యాయి.
ఇవాళ్టి భూకంపం కారణంగా భారతదేశంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. బిహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.