భారత ఎన్నికల సంఘం ఢిల్లీ శాసనసభ ఎన్నికల తేదీలను అధికారికంగా ప్రకటించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు.
ఢిల్లీ ప్రస్తుత శాసనసభా కాలం ఫిబ్రవరి 23, 2025తో ముగుస్తుంది. అందువల్ల ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరుగుతుంది. 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ పూర్తి చేస్తారు.
ఈసీ గణాంకాల ప్రకారం ఢిల్లీలో 1,55,24,858 మంది ఓటర్లున్నారు. వారిలో పురుష ఓటర్లు 83.49లక్షలు కాగా మహిళా ఓటర్లు 71.74లక్షలు. ట్రాన్స్జెండర్లు 1261 మంది ఉన్నారు.
ఢిల్లీలో ఈవీఎంలతో జరిగే ఈ ఎన్నికలను అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచీ వెబ్‌కాస్టింగ్ చేస్తామని సీఈసీ వెల్లడించారు. దివ్యాంగులకు, వయోవృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఈసీ రాజీవ్ కుమార్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై పూర్తి భరోసా ఉందని మరోసారి స్పష్టతనిచ్చారు. ‘‘ఈవీఎంలను ఏర్పాటు దశ నుంచి ఓట్ల లెక్కింపు వరకూ నిరంతరం పరిశీలనలో ఉంచుతాం. ఈవీఎంల టాంపరింగ్ ఆరోపణలు ఎక్కడా నిరూపణ అవలేదు’’ అని స్పష్టం చేసారు.
ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటనతో ఢిల్లీలో నేటినుంచీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. తుది ఓటర్ల జాబితాను నిన్న సోమవారం ప్రచురించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య 1.09శాతం పెరిగింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్యనే ఉండనుంది. రెండుసార్లు అధికారంలో ఉన్న ఆప్, మూడోసారీ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఆప్ ప్రభుత్వం అవినీతి, తప్పుడు పరిపాలన నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పిస్తామని బీజేపీ వాగ్దానం చేస్తోంది.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్ధిగా ఉన్నారు. ఆయన మీద బీజేపీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు, మాజీ ఎంపీ పర్వేష్ వర్మను నిలబెట్టింది. అక్కడ కాంగ్రెస్ కూడా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌ను బరిలోకి దింపింది.
కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీ మీద బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, గతంలో ఆప్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబాను బరిలోకి దింపింది.
కాంగ్రెస్ గతంలో మూడుసార్లు వరుసగా గెలిచి 15 సంవత్సరాలు అధికారం చెలాయించింది. కానీ గత రెండు ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 8 సీట్లకు పరిమితమైంది.