భారత్‌తో కెనడా సంబంధాలకు తీవ్రంగా విఘాతం కలిగించిన ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి ఎట్టకేలకు రాజీనామా చేసారు. ప్రత్యామ్నాయం దొరికేవరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. ట్రూడో నిష్క్రమణ తర్వాత కెనడా-భారత్ సంబంధాలు ఎలా ఉంటాయన్నది అంతర్జాతీయంగా ఆసక్తికరమైన అంశంగా నిలిచింది.
ట్రూడో భారతదేశం మీద నిర్లక్ష్యంగా చేసిన ఆరోపణలు, అతనికి ఖలిస్తానీ అనుకూల శక్తుల అండ కారణంగా అతని హయాంలో ఇరు దేశాల మధ్యా పరిస్థితులు ఉద్రిక్త స్థాయి వరకూ వెళ్ళిపోయాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ కెనడా గడ్డ మీద హత్యకు గురైతే దానికి ఆ హత్య భారతదేశమే చేయించిందంటూ నోరు పారేసుకున్నాడు ట్రూడో. దాన్ని నిరూపించే ఆధారాలు కెనడా అధికారులు చూపలేకపోయారు. అలా దిగజారిపోయిన కెనడా భారత్ సంబంధాలు, ఇప్పుడు ట్రూడో తప్పుకున్న తర్వాత ఏ దిశగా సాగుతాయో చూడాలి.
దౌత్యం – విధానం:
న్యూఢిల్లీతో టొరంటో సంబంధాలు మెరుగవడం అనేది ట్రూడో వారసుడి మీద ఆధారపడి ఉంటుంది. లిబరల్ పార్టీ తమ నాయకుణ్ణి ఇంకా ఎన్నుకోవాలి. ఆ వచ్చే నాయకుడు భారత్ విషయంలో ట్రూడో దారినే అనుసరిస్తాడా లేక కొత్త విధానాన్ని అవలంబిస్తాడా అన్నది చూడాలి.
భారత్‌తో విభేదాలు ఉండకూడదని భావిస్తే కొత్త నేత చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమానంగా బేరీజు వేసుకుంటూ భేదాభిప్రాయాలను తొలగించాలి. రెండు దేశాల మధ్యా తీవ్ర విభేదాలకు కారణమైన నిజ్జర్ హత్య విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
ట్రూడో రాజీనామా తర్వాత కెనడాలో పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. భారత అధికారులు ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. కొత్త నాయకుడి నియామకం పూర్తయితే ఆ నేత భారత్‌తోనే కాదు, జనవరి 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్‌తో సైతం వ్యవహరించాల్సి ఉంటుంది. ట్రంప్ ఇప్పటికే కెనడా మీద టారిఫ్‌లు అమలు చేస్తామంటూ బెదిరిస్తున్నాడు. రాబోయే నేతకు అదో పెద్ద సవాల్.
అయితే కెనడాలో లిబరల్ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చునని భారత్‌లో పలువురు అంచనా వేస్తున్నారు. అన్ని పోల్స్‌లోనూ కన్జర్వేటివ్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఎన్నికలు జరిగితే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కన్జర్వేటివ్ పోలియెవ్‌కు పగ్గాలు దక్కేనా?:
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోలియెవ్, ట్రూడో భారత్‌తో సంబంధాలను హ్యాండిల్ చేసిన విధానాన్ని తీవ్రంగా విమర్శించాడు. అతను భారత్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఎక్కువ. అంతకంటె ముందు ఇరుదేశాల మధ్యా ఉద్రిక్తతలను సాధారణ స్థాయికి తీసుకురావాల్సి ఉంది.
కెనడాలో ఎవరు అధికారంలోకి వచ్చినా, వారు భారత్‌తో వాణిజ్య సంబంధాలను తప్పకుండా ఎదుర్కోవాలి. ట్రూడో అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పటికీ కెనడా-భారత్ వాణిజ్యం బాగా జరిగింది.,. 2024 ఆర్థిక సంవత్సర అంతానికి 8.4 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. కొత్త నేత కొత్త పద్ధతులకు మారితే, వాణిజ్య సంబంధాలకు విఘాతం కలిగే ప్రమాదముంది. అయితే వాణిజ్యపరంగా కెనడా తన విధానాలను మార్చుకునే ఆస్కారం లేదని నిపుణులు భావిస్తున్నారు.
కెనడాలోని భారత సముదాయం ఇమిగ్రేషన్ సంబంధిత విషయాలను నిశితంగా గమనిస్తూంటారు. ఇటీవల ట్రూడో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అక్కడి ఇండియన్ డయాస్పోరాను ఇబ్బందిపెట్టాయి. ట్రూడో హయాంలో ఫాస్ట్ ట్రాక్ స్టడీ వీసా ప్రోగ్రామ్స్‌ను నిలిపివేయడం అక్కడున్న భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత కలిగించింది. అలాగే కెనడాకు వెళ్ళే అంతర్జాతీయ విద్యార్ధుల పర్మిట్ల సంఖ్యను ఈ యేడాది 35శాతం తగ్గించేసాడు. వచ్చే యేడాది ఆ సంఖ్యను మరో 10శాతం తగ్గించేస్తానని చెప్పుకొచ్చాడు.
పియర్ పోలియెవ్ మరింత సమగ్రమైన ఇమిగ్రేషన్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. అతను బాగా చదివే విద్యార్ధులు, కష్టించి పనిచేసే కార్మికులకు అనుకూలంగా ఉన్నాడు. ట్రూడో విధానాలను విమర్శిస్తున్న పొలియెవ్ పట్ల కెనడా ప్రజానీకం సుముఖంగా ఉన్నాడు. అదే సమయంలో అతని చర్యలు తమను ఒంటరిని చేస్తాయని భావిస్తున్న భారతీయ వర్గాలు పొలియెవ్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి.
ట్రూడో వారసుడెవరు?:
ట్రూడో జనవరి 6న పదవికి రాజీనామా చేసినా, తన వారసుడు దొరికేవరకూ అధికారంలో ఆయనే ఉంటాడు. ఆ వారసుడి నియామకంలో ట్రూడోకు అవకాశం ఎంతుంటుంది అనేది అస్పష్టం. ప్రస్తుతానికి ఆరుగురి పేర్లు వినిపిస్తున్నాయి. లిబరల్ పార్టీ వారిలో ఎవరో ఒకరిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవచ్చు.
ట్రూడో ప్రభుత్వానికి ఇటీవలి కాలంలో ప్రత్యేక సలహాదారుగా పనిచేసిన 59ఏళ్ళ మార్ కార్నీకి అవకాశం ఉంది. రవాణా మంత్రి అనితా ఆనంద్ కూడా పీఎం పదవి రేసులో ఉన్నారు. 59ఏళ్ళ అనితా ఆనంద్ 2021లో రక్షణ మంత్రిగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్‌కు కెనడా సాయం అందించడం వెనుక ఉన్నది ఆమే. తర్వాత ఆమెను ట్రెజరీ బోర్డ్‌కు మార్చారు. ఆమె ప్రధాని పదవిని ఆశిస్తోందన్న కారణంతోనే ఆమెను అప్రాధాన్య శాఖకు మార్చారన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ మాజీ వ్యాపారవేత్త. సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేసారు. 54ఏళ్ళ ఫిలిప్ షాంపేన్ ప్రధాని పదవికి బలమైన అభ్యర్ధిగా పేరుంది. అతను అధికారంలోకి వస్తే కెనడా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న అంచనాలున్నాయి. వ్యాపార, రాజకీయ అవగాహన ఉన్నందున ఫిలిప్ షాంపేన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నాడు.
45ఏళ్ళ మెలానీ జాలీ విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసింది. 2021 నుంచీ కెనడా వాణిని ప్రపంచ వేదికలపై వినిపిస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతు పలికేందుకు ఆ దేశానికి చాలాసార్లు వెళ్ళింది. జస్టిన్ ట్రూడో సన్నిహితురాలు. లిబరల్ పార్టీ నేతగా చాలాకాలం నుంచీ ఉంది.
57ఏళ్ళ డొమినిక్ లె బ్లాంక్ ఆర్థిక, ప్రభుత్వ వ్యవహారాల మంత్రిగా పనిచేసాడు. ట్రూడోకు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకడు. గడ్డు పరిస్థితుల్లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. బలమైన రాజకీయ వ్యాఖ్యాతగా అతనికీ ప్రధాని అయ్యే అవకాశం ఉంది.
క్రిస్టీ క్లార్క్ బ్రిటిష్ కొలంబియాకు గతంలో ప్రధానిగా పనిచేసింది. ట్రూడో తర్వాత లిబరల్ పార్టీకి భవిష్యత్ దిశానిర్దేశం చేయడానికి తాను సిద్ధమని ఎప్పటినుంచో సంకేతాలిస్తోంది. ట్రూడో విమర్శించేవారిలో క్రిస్టీ క్లార్క్ అగ్రగణ్యురాలని చెప్పవచ్చు.
అమెరికాలో కలిసిపోండి – ట్రంప్:
ట్రూడో రాజీనామా తర్వాత అందరూ ఎదురు చూసిన స్పందన డొనాల్డ్ ట్రంప్‌ది. మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్, ట్రూడో రాజీనామా వార్త బైటకు రాగానే చిరకాలంగా తాను సూచిస్తున్న విజ్ఞప్తిని మరోసారి తెరమీదకు తెచ్చాడు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరిపోవాలన్నదే ఆ వాదన.
కెనడాను అమెరికాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను చాలామంది కెనడియన్లు స్వాగతిస్తారని ట్రంప్ భావించాడు. కెనడా మనుగడకు కావలసిన భారీ వాణిజ్య లోటులు, సబ్సిడీలను అమెరికా ఇంకెంత మాత్రం భరించలేదు. ఆ విషయం తెలిసే ట్రూడో తన పదవికి రాజీనామా చేసాడు. కెనడాను అమెరికాలో విలీనం చేస్తే టారిఫ్‌లు తొలగించవచ్చు, పన్నుల భారాన్ని తగ్గించవచ్చు. రష్యా, చైనాల నుంచి భద్రతాపరమైన బెదిరింపులను కెనడా భద్రతా ప్రణాళికలు ప్రస్తుతానికి ఏమీ చేయలేకపోవచ్చు. కానీ అలాంటి విలీనమే జరిగితే ప్రజలపై పన్నులు తగ్గుతాయి, టారిఫ్‌లు తీసేస్తాం, పన్నులు తగ్గిస్తాం అని చెప్పే వచ్చాము. కెనడా, అమెరికా కలిస్తే గొప్ప దేశాన్ని ఏర్పాటు చేయవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డాడు.