హిందువుల్లో ఇటీవల పెరుగుతున్న చైతన్యాన్ని, తమ ధర్మం పట్ల వారికి కలుగుతున్న జాగృతిని కొన్ని రాజకీయ పక్షాలు అన్యమత వ్యతిరేకతగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అదే కోవలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సైతం హిందూ చైతన్యాన్ని బూచిగా చూపుతూ భారత్‌లోని ముస్లిములను ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల ప్రచార సాహిత్యం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతోందని ఇంటలిజెన్స్ బ్యూరో కనుగొంది. వాటన్నింటిలోనూ ముస్లిములను రెచ్చగొట్టడానికి, హిందువులపై దాడులు చేయడానికీ హిందువుల ఐక్యతను సాకుగా చూపినట్లు ఐబీ కనుగొంది.
పలు భాషల్లో ప్రచారం:
మొదట్లో ఆ ఉగ్రవాద గ్రూపుల ప్రచారం ఆంగ్ల, హిందీ భాషలకు మాత్రమే పరిమితమై ఉండేది. అప్పట్లో వారి లక్ష్యం భారత్‌లోని ముస్లిములను ఆకట్టుకోవడం మాత్రమే. అయితే ఇప్పుడు అదే ప్రచార సామగ్రి మరాఠీ, మళయాళం, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ, గుజరాతీ, బెంగాలీ, తెలుగు భాషల్లో సైతం లభిస్తోందని నిఘావర్గాలు కనుగొన్నాయి.
ఇస్లామిక్ స్టేట్ తమ ప్రచార సాహిత్యాన్ని విస్తరింపజేసే లక్ష్యాన్ని అనుబంధ విభాగమైన ‘అల్ ఇసాబా’కు అప్పగించింది. ఆ గ్రూపు జిహాదీ సమాచారాన్ని చాలాకాలం క్రితమే ఇంగ్లిష్, హిందీలలో అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు అన్ని భారతీయ భాషల్లోకీ తీసుకొస్తోంది. తద్వారా మరింత ఎక్కువమందిని చేరే ప్రయత్నం చేస్తోంది. దానికోసమే ‘ఇస్లామిక్ అనువాద కేంద్రా’న్ని ఏర్పాటు చేసింది. దాని ఉద్దేశం ఇస్లామిక్ అతివాద సిద్ధాంతాలను భారతీయ భాషల్లో ప్రచారం చేయడమే. భారతదేశంలో ప్రజలు తమ భాష పట్ల భావోద్వేగాలు కలిగి ఉంటారు, భారతీయులను ఐక్యంగా ఉంచే అంశాల్లో ప్రధానమైనది భాష అనే విషయాన్ని ఐసిస్ అనుబంధ సంస్థ అయిన అల్ ఇసాబా గుర్తించింది. అందుకే జిహాదీ భావజాలాన్ని వివిధ భారతీయ భాషల్లోకి తర్జుమా చేయించాలని, తద్వారా మరింత ఎక్కువమంది ప్రజలను ఆకట్టుకోవాలనీ నిర్ణయించుకుంది.
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. దానికి ఆ సంస్థ ఈ ఫ్రాంతంలోని తమ మీడియా విభాగం అల్-కిఫా మీద ఆధారపడింది.
గత యేడాది నుంచీ ఈ పరిణామాలు బాగా పుంజుకున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ టెర్రర్ గ్రూపులు తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేసాయి. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్), అల్ ఖైదా సంస్థలకు ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండూ అందివచ్చాయి. వాటిని భారత్‌కు వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రస్థానాలుగా వాడుకోవచ్చు. రెండుదేశాల్లోనూ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇస్లామిక్ జిహాద్ పట్ల సరళంగా వ్యవహరిస్తున్నాయి. అది ఐసిస్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు సానుకూల పరిణామం.
విస్తరణే అజెండా:
ఐసిస్, అల్‌ఖైదాల ప్రచార సాహిత్యాన్ని నిశితంగా గమనిస్తే వారి లక్ష్యం భారతదేశం మాత్రమే కాదన్న సంగతి అర్ధమవుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ముస్లిములందరికీ కలిసి రావాలని, ప్రపంచమంతటా ఖలీఫా రాజ్యాన్ని నెలకొల్పాలనీ ఆ ఉగ్రవాద సంస్థలు పిలుపునిస్తున్నాయి.
ఆ ప్రచార సాహిత్యంలో ఒక చిన్న అంశాన్ని చూద్దాం. ‘గజ్వా ఎ హింద్’ అనే పేరున్న రచన ఒకటుంది. ముస్లిములు చాలా ‘విలాయా లేక ప్రొవిన్సు’లను సృష్టించుకోవాలని అది చెబుతుంది. ఐసిస్… పాకిస్తాన్, ఖొరాసాన్ (అప్ఘానిస్తాన్), కశ్మీర్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక అనే ప్రొవిన్సులను ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రొవిన్సులలోని ముస్లిములందరూ సమైక్యంగా ఉండాలని, ఆ మొత్తం ప్రాంతమంతటినీ కలిపి ఇస్లామిక్ ఖిలాఫత్‌గా ప్రకటించాలనీ ఐసిస్ ఆశిస్తోంది.
ఈ ఇస్లామిక్ అతివాద ప్రచార సాహిత్యం ఒకవైపు తమ దీర్ఘకాలిక ప్రణాళిక అయిన ఇస్లామిక్ సామ్రాజ్య సాధన గురించి చెబుతూనే, మరోవైపు ‘లోన్-వుల్ఫ్ ఎటాక్స్’ (ఒక వ్యక్తి ఏదైనా ఆయుధంతో ఒక ప్రజాసమూహం మీద ఆకస్మికంగా చేసే దాడులు) కూడా చాలా ముఖ్యమని వివరిస్తుంది. ఆ అతివాద ప్రచార సాహిత్యం ఎంత తీవ్రమైన పదజాలంతో ఉంటుందంటే అది పెద్దసంఖ్యలో ముస్లిం యువతను సులువుగా అతివాదం వైపు ఆకర్షించి ముస్లిమేతరులపై దాడులు చేయడానికి పురిగొల్పేలా ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అమెరికాలోని న్యూ ఆర్లేన్స్‌లో ఒక ముస్లిం వ్యక్తి తన వాహనంతో మార్కెట్ ఏరియాలోని ప్రజలను గుద్ది చంపేసిన సంఘటన ఈ అతివాద ప్రచార సాహిత్యం ప్రభావానికి నిదర్శనం. ఒక వ్యక్తిని అతివాద ప్రచార సాహిత్యం ఉగ్రవాదిగా ఎలా మార్చేస్తుందనడానికి ఆ సంఘటన మన కళ్ళముందరి ఉదాహరణ. అలాంటి అతివాద ప్రచార సాహిత్యం ఇంటర్నెట్‌లో కుప్పలు కుప్పలుగా దొరుకుతోంది. ఇప్పుడు అలాంటి ప్రచారాన్ని పలు మెసేజింగ్ ప్లాట్‌ఫారంల ద్వారా పంపిస్తూ జమీషా ముబీన్, మొహమ్మద్ షరీక్ వంటి ముస్లిం యువతను రాడికలైజ్ చేస్తున్నారు. ముబీన్ కోయంబత్తూరులో అలాంటి దాడే చేసాడు. షరీక్ మంగళూరులో ప్రయత్నించిన దాడి విఫలమైంది.
ఒక నిఘా అధికారి చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది, కానీ నిఘా విభాగానికి ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా లేకుండా పోయింది. వారు ఉగ్రవాద సంస్థల ప్రచార సాహిత్యాన్ని ఒకటి తీసిపారేస్తుంటే, మరో పది వచ్చేస్తున్నాయట. దాన్నిబట్టే వారి కార్యకలాపాల తీవ్రత ఎంతుందో అర్ధమవుతోందట. వారు ఇంటర్నెట్‌ను, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను అతివాద ప్రచార కంటెంట్‌తో ముంచెత్తుతున్నారు. ఆ ప్రచారం దేశంలో ఉన్న ముస్లిములందరికీ చేరుతోంది.
దక్షిణాది వైపు చూపు:
భారతదేశంలో ఉత్తర భాగంతో పోల్చుకుంటే దక్షిణాదిలో ఇస్లామిక్ రాడికలైజేషన్ గురించి బైటకు తెలిసింది చాలా తక్కువ. కానీ వహాబీయిజం, లవ్ జిహాద్ కేసులు, ఇస్లామిక్ రాడికలైజేషన్ దక్షిణ భారతదేశంలో కూడా చాలా బలంగా వేళ్ళూనుకుపోయాయి. అయితే రాజకీయాల మీద ఎక్కువ ధ్యాస ఉండడం, సోకాల్డ్ ఉదారవాదాల కారణంగా ఆ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఐసిస్, అల్‌ఖైదాల ప్రచార సాహిత్యాన్ని (ప్రాపగాండా మెటీరియల్) గమనిస్తే వారి మొత్తం దృష్టి దక్షిణ భారతదేశం మీద పెట్టారన్న సంగతి స్పష్టంగా అర్ధమవుతుంది. జిహాదీ సాహిత్యాన్ని ప్రతీ దక్షిణ భారతదేశ భాషలోకీ అనువదించారు. దాన్నిబట్టే ఈ ప్రాంతానికి ఉగ్రవాద గ్రూపులు ఇస్తున్న ప్రాధాన్యం తెలిసిపోతోంది.
ఇస్లామిస్టులు దక్షిణ భారతంలో ఎంతో సులువుగా ఆపరేట్ చేస్తున్నారు. దక్షిణాదిలోకి వహాబీల వ్యాప్తి పదేళ్ళకు పైగా జరగుతున్నా దానిగురించి ఎవరికీ ఏమీ తెలీదు. వహాబీ ప్రభావం వల్లనే కేరళలోనూ, ఇతర ప్రాంతాలలోనూ మసీదులు సౌదీ అరేబియా నమూనాలో నిర్మిస్తున్నారు. అలాగే ముస్లిములు దుస్తులు ధరించే పద్ధతి కూడా సౌదీ అరేబియా పద్ధతిలోకి మార్చేసారు. అన్నిటికంటె ముఖ్యంగా, పర్షియన్ సంబోధన అయిన ఖుదా హఫీజ్ ఇప్పుడు అల్లా హఫీజ్‌గా మారిపోయింది.
దక్షిణ భారతంలో అతివాద ఇస్లాం వ్యాప్తికి మరో ప్రధాన ఉదాహరణ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఆవిర్భావం. ఆ సంస్థ ఒక సామాజిక సంస్థ ముసుగులో ఎంత సులువుగా వ్యాపించేసిందో చూస్తే భారతదేశపు వ్యవస్థ ఆ సంస్థ విషయంలో ఎంత సరళంగా వ్యవహరించిందో అర్ధమవుతుంది. కొద్దికాలంలోనే పీఎఫ్ఐ అత్యంత ప్రమాదకరమైన టెర్రర్ గ్రూపుగా రూపాంతరం చెందింది. దాని పునాదులు ఎంత బలంగా ఉన్నాయంటే ఆ సంస్థ ఇక్కడనుంచీ ఇస్లామిక్ స్టేట్‌కు (ఐసిస్) ఉగ్రవాదులను రిక్రూట్ చేసే సంస్థగా తయారైంది.
ఈ సంఘటనలు ఉగ్రవాద గ్రూపుల దృష్టిని ఆకర్షించాయి. దక్షిణాదిన దుకాణం మొదలుపెట్టడం సులువు అని వాటికి అర్ధమైంది. అందుకే ఆ ఉగ్రవాద గ్రూపులు దక్షిణ భారతదేశంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇవాళ దక్షిణ భారతదేశం ఇస్లామిక్ అతివాద రాడికలైజేషన్‌కు కేంద్రస్థానం మాత్రమే కాదు, అంతర్జాతీయ మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు సైతం రవాణా కేంద్రంగా మారింది. అయితే ఈ సమస్యను పరిష్కరించవలసిన అధికార గణం అదే నేరంలో భాగస్వామిగా ఉండడం పలు సందర్భాల్లో స్పష్టంగా బైటపడింది.
ప్రస్తుతం దేశీయ నిఘా సంస్థలు దక్షిణాదిని నిశితంగా పరిశీలిస్తున్నారు. తమకున్న సమాచారంతో వారు ఈ ప్రాంతంలో ఇస్లామిక్ జిహాద్‌ను వ్యాపింపజేయడానికి అసాధారణ స్థాయిలో కార్యకలాపాలు జరగబోతున్నాయని అంచనా వేస్తున్నారు.