బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా ఈ రేసు కేసులో చుక్కెదురైంది. కేసును కొట్టి వేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసు సంస్థతో ఒప్పందం జరగకముందే రూ.46 కోట్లు చెల్లింపులు జరిపారని ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. గత నెల 31నే వాదనలు పూర్తి చేశారు. ఇవాళ హైకోర్టు తీర్పును వెలువరించింది.
ఫార్ములా ఈ రేసు సంస్థ ప్రతినిధులు, అప్పటి పురపాలక శాఖ కమిషనర్ మధ్య ఒప్పందం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలు అధికారులు అమలు చేస్తారంటూ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలను దవే ఖండించారు. ఇరువర్గాల వాదనలువిన్న న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది.
మాజీ మంత్రి కేటీఆర్ అక్రమ అరెస్టును అడ్డుకోవాలంటూ గతంలోనే వేసిన పిటిషన్ కూడా తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేటీఆర్ అరెస్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. న్యాయవాదులతో సమీక్ష జరుపుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తరవాత ఏసీబీ అరెస్టులు ప్రారంభిస్తుందా? లేదంటే ఇవాళ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తుందా అనే విషయం సాయంత్రానికి తేలనుంది.