చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌లో ప్రవేశించింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, తమిళనాడులో రెండు, గుజరాత్లో ఒక కేసు నమోదు కాగా, తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకింది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా కేసులతో భారత్‌లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వైరస్ కొత్తదేమీ కాదని, దీన్ని 2001లోనే గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
చైనాలో 6 కోట్ల మందికి హెచ్ఎంపీవీ సోకిందని తెలుస్తోంది. ఈ వైరస్ జపాన్‌కు కూడా విస్తరించింది. శీతాకాలంలో వేగంగా వ్యాపిస్తోంది. వ్యాధి లక్షణాలు తీవ్రమైతే న్యిమోనియా, బ్రాంకైటీస్‌కు దారితీస్తుంది. మరణాలు కూడా సంభవిస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం, దద్దుర్లులాంటి లక్షణాలతో బాధపడేవారు మాస్క్, ధరించడంతోపాటు డాక్టర్ సలహాతో వైద్య సేవలు పొందాలని సూచిస్తున్నారు.
హెచ్ఎంపీ వైరస్ కేసులు నమోదు కావడంతో భారత్ అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు, జర్వంతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు, అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు.
వైరస్ అంత ప్రమాదకరం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా ప్రకటించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. అయితే ప్రయాణాలు చేసేవారు, వ్యాధి లక్షణాలు కనిపించిన వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాధి లక్షణాలు గుర్తిస్తే వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.