ఈ నెల 11న ప్రారంభం ..17న ముగింపు
జనవరి 8న స్వచ్ఛ శ్రీశైలం
ఆదిదంపతులు కొలువుదీరిన శ్రీశైల క్షేత్రంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 11న ఉత్సవాలు మొదలై 17తో ముగియనున్నాయి.
శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రతీ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మకర సంక్రమణం, మహాశివరాత్రి సందర్భంగా ఆదిదంపతులకు ఉత్సవాలు జరుపుతారు.
బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన జనవరి 12న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి వాహనసేవలు జరుగుతాయి. 14న సంక్రాంతి రోజున కళ్యాణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు అయిన 17న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలు జరుపుతారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే వాహనసేవలు..
జనవరి 11: బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
జనవరి 12: భృంగివాహన సేవ
జనవరి13 : కైలాసవాహన సేవ
జనవరి14: నందివాహన సేవ
జనవరి15: రావణవాహన సేవ
జనవరి 16: పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణం
జనవరి17: అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించనున్నారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య చర్యలు మరింత పకడ్బందీగా చేపట్టనున్నారు. ఈ విషయాన్ని శ్రీశైల ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రాన్ని 6 జోన్లుగా, 11 సెక్టార్లుగా, 68 ప్రదేశాలుగా విభజించి పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.