బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చి బిహార్‌లో నివసిస్తున్న సుమిత్రా ప్రసాద్ అనే మహిళకు భారత పౌరసత్వం లభించింది. ఇన్నాళ్ళూ వీసా మీద భారత్‌లో ఉంటున్న సుమిత్ర నాలుగు దశాబ్దాలుగా భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు అమల్లోకి వచ్చాక ఆమె భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు జనవరి 3న పౌరసత్వం లభించింది. సీఏఏ కింద ఒక విదేశీయురాలికి భారత పౌరసత్వం లభించడం బిహార్‌లో ఇదే మొదటిసారి. బంగ్లాదేశ్‌లో హిందువులను ఇస్లామిక్ అతివాదులు చిత్రహింసలు పెడుతున్నారని సుమిత్ర చెప్పారు.
సుమిత్ర తండ్రి మదనగోపాల్. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో సుమిత్ర అలియాస్ రాణీ సాహాను ఐదేళ్ళ వయసులో తన చెల్లెలి దగ్గర వదిలేసారు. సుమిత్ర మేనత్త బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహీ జిల్లాలో నివసించేవారు. 1971లో పాకిస్తాన్ విభజన తర్వాత బంగ్లాదేశ్‌లో అరాచకం ప్రబలింది. ఆ సమయంలో తన మేనత్త ఇంట్లో ఉన్న సుమిత్ర హైస్కూల్ పాస్ అయ్యారు.
బంగ్లాదేశ్‌లో హిందువులను సరిగ్గా చూడరని సుమిత్ర చెప్పారు. ఇస్లామిక్ అతివాదులు రోజూ వేధిస్తుండడంతో తట్టుకోలేక సుమిత్ర 1985లో తనకు 20ఏళ్ళ వయసులో భారత్ వచ్చారు, తన తండ్రి దగ్గర కటీహార్‌లో ఉండిపోయారు. అప్పటినుంచీ ఆమె మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళలేదు. 1985లో సుమిత్రకు అరా జిల్లాలోని పరమేశ్వర్ అనే వ్యక్తితో పెళ్ళయింది. ఆయన ఓ చిన్న దుకాణం నిర్వహిస్తారు. ఆ జంటకు ముగ్గురు కుమార్తెలు. సుమిత్ర భర్త 2010లో అనారోగ్యంతో మరణించారు.
సుమిత్ర భారత్ వచ్చినప్పటినుంచీ ఈ దేశ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రతీయేడాదీ వీసా ఆఫీసులకు వెడుతుండడం అలవాటైపోయింది. బిహార్‌లో తాను నివసించే ప్రదేశంలో ఇరుగుపొరుగులు తనను మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపొమ్మనేవారట. 2023లో వీసా పొడిగింపు ఆలస్యమైనప్పుడు పోలీసులు కూడా అదే సలహా ఇచ్చారట. మరికొందరైతే ఆమెను జైలుకు వెడతావంటూ భయపెట్టారు కూడా.
కొన్నాళ్ళకు సుమిత్ర కూతురు ఐశ్వర్యకు సీఏఏ గురించి తెలిసింది. తల్లి తరఫున ఐశ్వర్య దరఖాస్తు చేసింది. మూడు నెలల్లోనే సుమిత్రకు భారత పౌరసత్వం వచ్చింది. ఇప్పుడు సుమిత్ర కుటుంబం ఆనందానికి అవధుల్లేవు.