తమిళనాడులో అధికార డీఎంకే జాతీయగీతాన్ని అవమానించిందంటూ అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేసారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో సంప్రదాయికంగా చేయవలసిన గవర్నర్ ప్రసంగం కూడా చేయకుండా ఆయన బైటకు వచ్చేసారు.
ఈ విషయం గురించి గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర శాసనసభలో జాతీయగీతానికి బదులు రాష్ట్రగీతం తమిళ్ తాయి వళత్తు ఆలపించారు. జాతీయగీతానికి జరిగిన అవమానంతో ఖిన్నుడైన గవర్నర్ సభనుంచి బైటకు వచ్చేసారని ఆ ప్రకటనలో వెల్లడించారు.
‘‘భారత రాజ్యాంగం, జాతీయగీతం మరోసారి ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో అవమానానికి గురయ్యాయి. మన రాజ్యాంగం చెప్పిన ప్రాథమిక విధుల్లో జాతీయగీతాన్ని గౌరవించడం ఒకటి. దేశంలోని అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయగీతాన్ని ఆలపిస్తారు. ఇవాళ గవర్నర్ అసెంబ్లీకి చేరుకున్నప్పుడు రాష్ట్రగీతం తమిళ తాయి వళత్తు మాత్రమే ఆలపించారు. జాతీయగీతాన్ని ఆలపించడం రాజ్యాంగ విధి అని గవర్నర్ సభకు గౌరవంగా గుర్తేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, శాసనసభ స్పీకర్‌కు జాతీయగీతం పాడమని విజ్ఞప్తి చేసారు. కానీ వారు దానికి నిరాకరించారు. అది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. రాజ్యాంగానికీ, జాతీయగీతానికీ జరిగిన అలాంటి అగౌరవానికి సాక్షిగా ఉండలేక గవర్నర్ తీవ్ర ఆవేదనతో సభను వీడారు’’ అని గవర్నర్ కార్యాలయం ప్రకటన వెల్లడించింది.