ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ వివాదాస్పద ప్రకటన చేసారు. రాబోయే మహాకుంభ్ కోసం వినియోగిస్తున్న 55 బిఘాల భూమి వక్ఫ్ బోర్డు సొంతమని ప్రకటించారు. ఒక వీడియో సందేశంలో, హిందువుల కుంభమేళా కోసం వక్ఫ్ భూమిని వాడుకోడానికి అభ్యంతర పెట్టకుండా ప్రయాగరాజ్‌లోని ముస్లిములు ఔదార్యం చూపారంటూ షహాబుద్దీన్ రజ్వీ వ్యాఖ్యానించారు. పైగా, కుంభమేళాలో ముస్లిములను సామూహికంగా మతమార్పిడి చేస్తారని ఆరోపించారు. షహాబుద్దీన్ వ్యాఖ్యలపై హిందూ ధార్మిక నేతలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు.
బెనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గిరీష్‌చంద్ర త్రిపాఠీ కూడా షహాబుద్దీన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘భారతదేశంలో ప్రాచీనకాలం నుంచీ ప్రతీ పన్నెండేళ్ళకూ కుంభమేళా నిర్వహిస్తారు. గ్రహగతుల ఆధారంగా ఆ మేళా జరుగుతుంది. అలాంటి గొప్ప పండుగను కురచ బుద్ధులతో కొలవడం అసంబంద్ధం మాత్రమే కాదు, అవాంఛనీయం కూడా. మన ఋషులు జీవితకాలం తపస్సు చేస్తూ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటిస్తూ భారతదేశపు ఆలోచనా విధానాన్ని, భారతీయ తత్వాన్ని, దార్శనికతనూ ఆవిష్కరించారు. కుంభమేళా భారతీయ తాత్వికతకు, దార్శనికతకూ వ్యాఖ్యానంగా నిలుస్తున్న కాలాతీతమైన సంప్రదాయం. భారతీయ సంస్కృతికి సారాంశ రూపమైన కుంభమేళాకు ఎవరి ఆమోదమూ అక్కర్లేదు’’ అని చెప్పారు.
షహాబుద్దీన్ వ్యాఖ్యలపై జునా అఖాడా మహామండలేశ్వర్ స్వామి ఉమాకాంతానంద సరస్వతీ మహరాజ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘ఆయన అలా మతసామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడకుండా ఉండాల్సింది. అసలు వక్ఫ్ బోర్డు ఏర్పాటే తప్పు. లౌకికవాద దేశంలో అందరికీ ఒకటే చట్టం ఉండాలి, అందరినీ సమానంగా పరిగణించాలి. వక్ఫ్ బోర్డు ఉంటే, సనాతన బోర్డు కూడా ఉండాల్సిందే. ఈ వక్ఫ్ బోర్డులు తమకు కనిపించిన ప్రతీ భూమీ, ప్రతీ ఆస్తీ తమదేనని చెప్పేసుకుంటూ ఉంటాయి. వారి తర్కం ప్రకారం భారతదేశం మొత్తం వక్ఫ్ బోర్డుదే. అప్పుడు మనం ఎక్కడికి పోవాలి? ముస్లిములు ఈ దేశంలోకి బైటినుంచి వచ్చారు, లేదా ఇక్కడివారు మతం మారారు. కాబట్టి వారి తర్కం ప్రకారమే ఆలోచిస్తే వాళ్ళ ఇళ్ళూ ఆస్తులూ అన్నీ భారతదేశానివి, హిందువులవే. అలా అనడం సరికాదుకదా. షహాబుద్దీన్ రజ్వీ మొత్తం ముస్లిం సమాజానికి ప్రతినిధి కాదు,ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించనక్కరలేదు’’ అన్నారు.
కిన్నర అఖాడాకు మహామండలేశ్వర్ కౌసల్యానంద గిరి, ముస్లిం జమాత్ అధ్యక్షుడి ప్రకటనపై తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి నిరాధారమైన వ్యాఖ్యలను బట్టే అతను సనాతన ధర్మానికి విరోధి అన్న సంగతి తెలుస్తోందన్నారు. సనాతన ధర్మపు పండుగల్లో మహాకుంభ్ అతిపెద్దది, అంత పెద్ద పండుగను అంతే గొప్పగా వైభవంగా జరుపుకొంటున్నామన్న విషయాన్ని షహాబుద్దీన్ రజ్వీ లాంటివారు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. గంగానదీ తీరంలో మహాకుంభ్ ప్రాచీనకాలం నుంచీ జరుగుతోందని, ఆ నేలను తమదిగా ప్రకటించుకోవడంతో షహాబుద్దీన్ రజ్వీ సనాతన ధర్మానికి వ్యతిరేకి అని తేటతెల్లమైందన్నారు.
మహాకుంభమేళా వక్ఫ్ భూమి మీద జరుగుతోంది, అక్కడ ముస్లిములను మతం మారుస్తారు అంటూ షహాబుద్దీన్ చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇస్లాం పుట్టడానికి చాలాకాలం ముందునుంచే మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు. ఈ మౌలానాలు మహమ్మద్ అలీ జిన్నా బాటలో నడుస్తున్నారు. దేశాన్ని గజ్వా-ఎ-హింద్‌గా మార్చాలన్న వారి కోరిక ఎప్పటికీ నెరవేరదు’’ అన్నారు.
‘‘దేశాన్ని మతపరంగా విభజించినవారు ఇప్పుడు వక్ఫ్ పేరిట భారత భూభాగాన్ని ఆక్రమించే కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను నిలిపివేయాలి. మహాకుంభమేళాలో రాజకీయాలేమీ జరగడం లేదు. అది ధర్మానికి, పుణ్యానికీ సంబంధించిన విషయం’’ అన్నారు సాధ్వీ రితంభర.
పన్నెండేళ్ళకోసారి జరిగే మహాకుంభమేళా ఈ యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో నిర్వహిస్తారు. కుంభమేళా స్నానాల్లో ముఖ్యమైన ‘షాహీస్నాన్’ జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి తేదీల్లో ఆచరిస్తారు.