చైనాను వణికిస్తోన్న హెచ్ఎంపీ వైరస్ బెంగళూరులో వెలుగు చూసింది. ఓ చిన్నారిలో ఈ వైరస్ గుర్తించినట్లు జాతీయ మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిపిన పరీక్షల్లో ఓ ఆరేళ్ల చిన్నారికి హెచ్ఎంపీ వైరస్ సోకినట్లు గుర్తించినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. అయితే ఆ రిపోర్టులపై తమకు అనుమానాలు లేవన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు రిపోర్ట్ చేశారు.
బెంగళూరు చిన్నారికి హెచ్ఎంపీ వైరస్ సోకడంతో దేశంలో మొదటి కేసుగా గుర్తించారు. ఇప్పటికే చైనాలో 6 కోట్ల మందికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. చైనాలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. శీతాకాలం కావడంతో న్యూమోనియా, హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది డాక్టర్లు చెబుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శీతాకాలంలో శ్వాసకోస సంబంధిత జబ్బులు వస్తూనే ఉంటాయని వైద్యులు ప్రకటించారు.
బెంగళూరులో హెచ్ఎంపీ వైరస్ కేసు నమోదు కావడంతో పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, దద్దుర్లు, జ్వరంతో బాధపడుతోన్న వారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని వైద్యాధికారులు సూచించారు. హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిపై కేంద్రం అలర్ట్ అయింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జపాన్, చైనా నుంచి వస్తోన్న ప్రయాణీకులపై దృష్టిపెట్టారు.