రాజమహేంద్రవరంలో సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. కాకినాడ పోర్ట్ నుంచి షిర్డీ వెళ్లే ఈ రైలు సమయాలను ఇటీవల మార్చారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ ముందే ప్రకటించింది.మార్చిన సమయం ప్రకారం కాకినాడ పోర్ట్ స్టేషన్లో తెల్లవారుజామున 5 గంటలకే రైలు బయలు దేరింది. గతంలో ఈ రైలు 6 గంటలకు బయలుదేరేది. చాలా మంది ప్రయాణీకులు రైలును అందుకోలేకపోయారు. వారంతా స్టేషన్లో ఆందోళనకు దిగారు. దీంతో రైలును రాజమహేంద్రవరం స్టేషన్లో 3 గంటలుగా నిలిపివేశారు.
కాకినాడ పోర్ట్, సామర్లకోటలో షిర్డి ఎక్స్‌ప్రెస్ అందుకోలేకపోయిన ప్రయాణీకులను మరో రైలులో రాజమహేంద్రవరం స్టేషన్‌కు తరలిస్తున్నారు. వారు రాగానే షిర్డి ఎక్స్‌ప్రెస్ బయలు దేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 3 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.
రైలు ప్రయాణాల్లో మార్పులను రైల్వే శాఖ ముందే ప్రకటిస్తుంది. షిర్డి ఎక్స్ ప్రెస్ విషయంలో ఎప్పుడో రెండు నెలల కిందట రిజర్వేషన్లు చేయించుకున్న వారికి సరిగా సమాచారం చేరకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.