ఆమ్ ఆద్మీ పార్టీ తీరుతో దిల్లీ ప్రజలు విసిగిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత పదేళ్ళ ఆప్ ప్రభుత్వ పాలనలో దిల్లీ అభివృద్ధి పట్టాలు తప్పిందన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, ప్రజావ్యతిరేక పార్టీ అని దుయ్యబట్టిన ప్రధాని మోదీ, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా దిల్లీని అభివృద్ధి చేయడం బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు. దిల్లీ లో బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసం తనకు ఉందన్నారు.
దిల్లీ-ఘజియాబాద్-మేరఠ్ నమో భారత్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ, విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు.
ఈ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13 కిలోమీటర్ల విభాగంలో 6కిలోమీటర్ల మేర భూగర్భంలో నడవనున్నట్లు అధికారులు తెలిపారు. నమో భారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారి.