భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి పదవికి దేవజిత్ సైకియా ఎన్నికకానున్నారు.ఇప్పటవరకు సెక్రటరీగా పనిచేసిన జైషా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధ్యక్షుడిగా ఎన్నికవాడంతో ఖాళీని భర్తీ చేస్తున్నారు.
గడిచిన నెల రోజులుగా బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సైకియా, త్వరలో పూర్తి స్థాయి బాధ్యతలు చేపడతారు. బీసీసీఐ కోశాధికారి పదవికి ప్రభ్‌తేజ్ భాటియా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు పదవులకు వీరిద్దరు మాత్రమే దరఖాస్తు చేయడంతో ఎంపిక ఏకగ్రీవం కానుంది.
గతంలో ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆశిశ్ షెలార్, మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ ఖాళీని కూడా బీసీసీఐ భర్తీ చేస్తోంది.
జనవరి 12న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి ఎన్నికకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.