అఖిల భారతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ నుంచి చేసాం. దేవాలయాలను హిందూ సమాజానికి రాష్ట్రప్రభుత్వాలు అప్పగించాలంటే ఆ మేరకు హిందూ సమాజం సిద్ధపడాలి, రాష్ట్రప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించాలని విహెచ్పి అఖిల భారత సంఘటనా ప్రధాన కార్యదర్శి మిలింద్ శ్రీకాంత్ పరాండేజీ పిలుపునిచ్చారు.
ఆ విషయంలో మేము మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. ముఖ్యమంత్రి తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారినీ కలిసి వివరించాము. విహెచ్ పి తయారు చేసిన ముసాయిదాను వారికి అందించాము. మన సమాజం ఒక శక్తికేంద్రం మీద ఆధారపడి లేదు. ఎన్నో శక్తికేంద్రాలున్నాయి. వాటి అన్నింటిలో దేవాలయాలు గొప్పవి.
అలాంటి శక్తికేంద్రాలైన మందిరాలను విదేశీ పాలకులు తమచేతిలోకి లాక్కున్నారు. దురదృష్టవశాత్తు స్వతంత్రం వచ్చాక కూడా దేవాలయాల నిర్వహణ ప్రభుత్వాల చేతిలోనే మగ్గిపోతోంది. దేవాలయాలు కేవలం ఉపాసనా కేంద్రాలు మాత్రమే కాదు… సమాజ శక్తికేంద్రాలుగా మారాలి., ఇవాళ సహజీవనాలు పెరిగాయి, మాదకద్రవ్యాల వాడకం పెరిగింది, వృద్ధాశ్రమాలు, లవ్ జిహాద్ కేసులు, కుల వివక్ష, వరకట్నం లాంటి సామాజిక దుర్మార్గాలు పెరుగుతున్నాయి.
ఇలాంటి సామాజిక ముఖచిత్రం మారాలంటే దేవాలయాలు సశక్తం కావాలి. ఇవాళ హిందూసమాజంలో జననాల రేటు తగ్గుతోంది. హిందువుల ఇళ్ళలో ఒకరిద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఆ విషయంలో సాధుసంతులు దిశానిర్దేశం చేయాలి. హిందూ సమాజం ఉంటేనే దేవాలయాలను రక్షించుకోగలుగుతాం. ప్రభుత్వాల నుంచి దేవాలయాల విముక్తి కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నాం.