ప్రియ భగవద్బంధువుల్లారా…
హైందవ శంఖారావం పిలుపుతో రాష్ట్రం నలుమూలల నుంచీ శ్రద్ధ,భక్తి, ప్రేమ, అంకిత భావాలతో శ్రమను పక్కన పెట్టి ఇక్కడకు వచ్చిన మీరందరికీ మంగళాశాసనాలు. మీరంతా ఎండలో కూర్చుని ఎండను ఆస్వాదిస్తున్నారు. మీ ముఖాల్లో ఎండను కూడా చల్లబరిచే తేజస్సును మేం గమనిస్తున్నామని శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ గుర్తుచేశారు. ఆలయాల మీద మీకుండే ప్రేమ, ఆలయాలను కాపాడుకోవాలనుకునే మీ దీక్ష, గ్రామగ్రామాల నుంచీ వచ్చిన ముదుసలులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇందాక దారిలో… 80ఏళ్ళు దాటిన మాతృమూర్తులు కర్ర పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే చూసాము. దాన్ని బట్టే ఆలయాల మీద మీ దీక్షా శ్రద్ధలు అర్ధమవుతున్నాయి.
మీలో ఎందరు సెల్ ఫోన్లు వాడతారు? అందరూ… సెల్ కొంతసేపు వాడాక ఛార్జింగ్ చేయాలి.
ఇవాళ సెల్ మీద ఆధారపడిన బతుకులు మనవి. వాటిని రీచార్జ్ చేసుకోవాలంటే ఏదోఒక పాయింట్‌లో పెట్టాలి కదా. ఆ కేంద్రం సరిగ్గా ఉండాలి కదా. వంకరగా ఉంటే పనిచేయదు కదా…
మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకుంటే.. మనం రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. అది భగవంతుడిని దృష్టిలో పెట్టుకునే చేస్తుంటాం. ఏ పని మనం చేసినా దైవసేవగా, యజ్ఞంగా భావించి చేయాలి అని మన తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు నేర్పించారు. జీవితం అనే సెల్ ఫోన్‌ని ఆ పద్ధతిలో వాడుతున్నాం. ఆ జీవితమనే సెల్ ఫోన్‌ను రీచార్జ్ చేసే వ్యవస్థే దేవాలయం. ఆలయం అనే రీచార్జ్ పాయింట్ బాగుంటేనే మన జీవితమనే సెల్ ఫోన్ సరిగ్గా పనిచేస్తుంది. అంటే మన బతుకులు బాగుండాలంటే ఆలయ వ్యవస్థ బాగుండాలి.
గతంలో మహారాజులు, జమీందార్లు ఆలయాలు కట్టారు. వందల ఎకరాల భూములు ఇచ్చారు, లక్షల విలువైన ఆభరణాలు ఇచ్చారు. వాటి పోషణకు వ్యవస్థలు ఏర్పాటు చేసారు. అప్పుడే సమాజం సుఖశాంతులతో ఉంటుందనే సంకల్పం వారిది. మన రాష్ట్రంలోనే ఆలయాలకు సుమారు 15 లక్షల ఎకరాల భూములు ఉండేవట. అవి క్రమంగా ఐస్‌గడ్డ కరిగినట్లుగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్ళాక కరిగిపోయాయి. ఇప్పుడు కేవలం 4.5లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఆలయ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు చేయాలి? అవేమిటో అసలు ఏమీ తెలీని అధికారులు చేయాలా? అది అడగడానికే మీరందరూ వచ్చారు. అది ఎవరిని అడగాలో తెలియడానికే విశ్వహిందూ పరిషత్ ఈ సభ ఏర్పాటు చేసింది.
ఆలయాల్లో పూజ జరగాలంటే ఐదు నిమిషాల్లో చేయండి, అరగంట చేయండి అని ఒక ఆఫీసర్ చెప్పాలా లేక ధర్మాధికారి చెప్పాలా? ఆలయాలు మనం కట్టుకుంటున్నాం. మన ఊళ్ళలో మన కాలనీల్లో మనం చిన్నచిన్న గుడులు కట్టుకుంటున్నాం. మరి వాటిని నిర్వహించుకోవడం మనకు చేతకాదా?
కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ఠ చేసారా? ఎవరో పెద్దలతో చేయిస్తారు కదా. ఆలయంలో జరిగే ఏ సేవ అయినా, ఆలయపు ఆస్తులైనా, అక్కడి సంప్రదాయాలైనా ఆలయ నిర్మాతల, నిర్వాహకుల చెప్పుచేతల్లో ఉండాలి తప్ప అధికారుల చేతిలో ఉండకూడదు. అధికారులు ఉంటామంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఆలయ ప్రతిష్ఠ చేసిన వారి నియమాలకు లోబడి పని చేసేలా ఉండాలి. ఎండోమెంట్స్ ఉండాలా వద్దా అన్నది తర్వాతి సంగతి…
ఆలయ నిర్వహణ ఆలయ సంప్రదాయాన్ని బట్టి, విధానాన్ని బట్టి, అక్కడి ఆచారాలు కట్టుబాట్లను బట్టి జరగాలి.
మీ ఆలయంలో ఉత్సవం ఐదురోజులు జరగాలంటే దాని పద్ధతి మీరు చెప్పాలి… అధికారులు దాన్ని అమలు మాత్రం చేస్తే చాలు.
1818లో చట్టం మొదలైంది. 1848లో దానికి ఒక స్వరూపం కల్పించారు. ఆ కమిటీలు ఇప్పుడు రాజకీయుల చేతిలో పడ్డాయి… అధికారులు బ్యురోక్రట్లు. వారిద్దరూ కలిపి ఆలయ సంప్రదాయాలను నాశనం చేస్తున్నారు.
ఆలయ ఆస్తులు ఏమైపోతున్నాయని ఇందాక అడిగారు. అది వాస్తవం. గ్రామంలో చెట్టు కింద గ్రామదేవత గుడి అయినా, పెద్ద గుడి అయినా… అక్కడ పూజా విధానాలు నిర్ణయించే పెద్దలు ఉన్నారు.. ఆ పద్ధతులకు భిన్నంగా నిర్వహించకూడదు.
ఆలయాలకు వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి. ఇవాళ అవి ఆక్రమణలకు గురయ్యాయి. 1996లో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ఆలయపు ఆస్తి ఎక్కడున్నా, ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది. ఆక్రమణలను తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ఎవరెవరు ఆక్రమించుకున్న ఆస్తులను వెనక్కు వచ్చేటట్లు చేయాలి.
ఆలయాల్లో ఆరాధనా సమయాలు, పదార్ధాలు, సంబంధిత అంశాలను సదరు ఆలయ సంప్రదాయం, ఆగమాన్ని తయారు చేసిన వ్యక్తులను అతిక్రమించి అధికారులు వ్యవహరించకూడదు.
తిరుపతి లాంటి గుడుల్లో అధికారులు వీఐపీ దర్శనాలు పెట్టి.. డబ్బులు లేనివారికి దర్శనాలు ఆపేసారు. ఒకాయన తన పదవీకాలంలో 4.5లక్షల వీఐపీ దర్శనాలు చేయించారు. అలాంటి దర్శనాలు మన మతంలో ఉండవు.
మిగతా మతాల్లో అలాంటివి ఉండవు. ఇక్కడ డబ్బులు పెట్టి దర్శనాలను నిలువరిస్తుంటే సామాన్యులు ఇతర మతాల్లోకి వెళ్ళిపోక ఏం చేస్తున్నారు.
అంటే… ఎండోమెంట్స్ శాఖ ద్వారా గుడులకు వెళ్ళకుండా ఆపడం మాత్రమే కాదు… ఇతర మతాల్లోకి ప్రజలను పంపేస్తున్నారు. అక్కడ డబ్బులు అడగరు, పైగా ఇస్తారు… అని చెబుతూ మతమార్పిడులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. అలాంటి అధికారులు ఉండకూడదు. ఆలయ సంప్రదాయాలను పాటించని అధికారులను పక్కకు తొలగించవలసిందే.
మేం రక్షిస్తున్నాం అని చెబితే వెర్రితనం. 15లక్షల ఎకరాలు కరిగిపోయి ఇప్పుడు 4.5లక్షల ఎకరాలకు పడిపోయాయి.
దేవాలయాల ఆస్తులను వెనక్కు తిరిగి ఇప్పించాలి అన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తక్షణం అమలుచేయాలి.
అప్పుడు గుడులు ఎవరి దగ్గరా చేతులు చాచనక్కరలేదు. మనం మన ఊళ్ళకు వెళ్ళాక, వీటిని సాధించడానికి ఏం చేయాలో ఆలోచించి ఆ మేరకు బృందాలను తయారు చేసుకుందాం. ఈ హైందవ శంఖారావం ఆ ప్రేరణ ఇవ్వగలిగితే దాని లక్ష్యం నెరవేరినట్లేనని శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ అభిప్రాయపడ్డారు.