మన రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యవర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఈ జనసందోహాన్ని, ఈ జెండాల రెపరెపలనూ చూస్తే పండుగ ముందుగా వచ్చిందన్నారు. 1987లో రాష్ట్రప్రభుత్వం దేవాలయాల ఉద్ధరణ కోసం అంటూ చట్టసవరణ చేసారు. దాని గురించి సౌందరరాజన్ ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అనే పుస్తకం రాసారు. ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ అనే కొండచిలువను సృష్టించింది అని చెప్పారు. చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం చేసిన మార్పులు హిందూ ఆలయ వ్యవస్థకు శరాఘాతంగా మారిందన్నారు.
ప్రతీ హిందువు ఇంట్లో పూజామందిరం ఉంటుంది. మరి ప్రత్యేకంగా దేవాలయాలు దేనికి? అంటే ఇంట్లో పూజ వ్యక్తిగతం. గుడిలో పూజ సామాజికం. దేవాలయాలు హిందువుల అస్తిత్వం. అందుకే దాన్ని చెడగొట్టడం కోసమే ముష్కరులు ఆలయాలపై దాడులు చేసారు తప్ప నిధులు కొల్లగొట్టడం కోసం కాదు.
1987 చట్టం ద్వారా అర్చకులను గట్టి దెబ్బ తీసింది. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. హిందూ ధర్మాచార్యులు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. ఆరుగురు సభ్యుల కమిషన్లో కేవలం ముగ్గురు సభ్యులతో చట్టాన్ని రూపకల్పన చేసారు. దాన్ని శాసనసభలో కేవలం నాలుగు గంటల నామమాత్రపు చర్చతో ఆమోదించి, చట్టరూపం తెచ్చారు. అర్చకులను ఉద్యోగులుగా మార్చేసిన చట్టం అది.
అర్చకులు ఉద్యోగులు కాదు, తమ దైవం సేవలో జీవితాన్ని గడిపేవారు. వారికి ఉద్యోగ విరమణ కల్పించడం అన్యాయం. ఆ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీం కూడా అర్చకులకు అనుకూలంగా వ్యాఖ్యానించింది. సుప్రీం ఆదేశాలు నేటికీ పూర్తిగా అమల్లోకి రాలేదు. మన రాష్ట్రంలో 20వేలకు పైగా గుడులకు ఆదాయం నామమాత్రం. 8 దేవాలయాల్లో మాత్రమే పెద్ద ఆదాయం. 1987 చట్టంతో మన దేవాలయాలపై గొడ్డలివేటు పడింది.
లౌకికవాదాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. అది మన అస్తిత్వానికి సమస్య కాలేదు, కారాదని ఎల్వీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.