యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలంటే భారతదేశం సురక్షితంగా ఉండాలి. దానికి హిందూ ధర్మం భద్రంగా ఉండాలని గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజీ అభిప్రాయపడ్డారు. హిందూ శంఖానాదం ఎలా ఉంటుందో ఈ సభలో చూస్తే అర్థమవుతుందని స్వామీజీ ఆనందం వ్యక్తం చేశారు. విశ్వకళ్యాణం కోసం భారతదేశం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంది.
నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఛత్రపతి శివాజీ నాటకం జరుగుతోంది. మన దేశ సమస్యలన్నింటికీ పరిష్కారం శివాజీ కార్యాచరణలో ఉంది. మనం ఏ దిశలో ప్రయాణం చేయాలో శివాజీ ఆచరించి చూపించారు.
శివాజీ శూరవీరుడు మాత్రమే కాదు సాధు సత్పురుషుడు కూడా. అంతేకాదు, ఆయన గొప్ప చతురుడు కూడా. ఆయన చాతుర్యం స్వార్థం కోసం విశ్వ కళ్యాణం కోసం. విశ్వకళ్యాణం హిందూధర్మంలో ఇమిడి ఉంది.
విశ్వానికి వెలుగు తూర్పునుంచి వచ్చింది. అది కూడా భారతదేశం నుంచి వచ్చింది, భారతదేశానికి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది. ఆ వెలుగు ఐదు బిందువుల నుంచి వచ్చింది. అవి ఒకటి మన శాస్త్రాలు
రెండు మన సాధుసంతులు, మూడవది గోమాత. నాలుగవది తీర్థక్షేత్రాలు. ఇప్పుడు ప్రయాగలో కుంభమేళా మొదలవుతోంది. అక్కడ అన్ని రాష్ట్రాల అన్ని భాషల అన్ని సంప్రదాయాల ప్రజలూ కలిసి ఒకే మంత్రం జపిస్తారు., హర గంగే హర గంగే. ఐదవది మందిరం.
మన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి భగవంతుడి నివాస స్థానాలు. అక్కడ దైవాన్ని మనం ఆవాహన చేసి ఆ దేవతల నివాసంలో వారికి పూజాదికాలు చేస్తాం. అందుకే వాటిని దేవాలయాలు అని పిలుస్తాము. అవే మన సంస్కృతికి ప్రేరణ కలిగిస్తాయి. ఆ పరమాత్మ మన రక్షకుడు అన్న భావన కలిగిస్తాయి. మన మందిరాలను రక్షించాలన్న ప్రతిజ్ఞ స్వీకరించడం కోసమే మనం ఇక్కడ కలిసాం.
అయోధ్యలో మనం అద్భుతమైన రామమందిరం నిర్మించుకున్నాం. అక్కడ ఏ పనిలోనూ ప్రభుత్వాల జోక్యం లేకుండా ఒక ఆదర్శమైన పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ పునాదులు వేసినప్పటి నుంచే అక్కడ ఒక ఆదర్శ పద్ధతిని ఏర్పాటు చేసుకున్నాం. ఐఐటీ ఖరగ్‌పూర్, రూర్కీ, ముంబై, చెన్నై, కర్ణావతి, భాగ్యనగరంలలోని నిపుణులతో రామమందిర నిర్మాణానికి సూచనలు తీసుకున్నాం. అయోధ్యలో రామమందిర నిర్మాణం అత్యంత పారదర్శకంగా చేసాం. ప్రతీ పైసాకూ లెక్క చూపించాం. ఎవ్వరూ ఎలా చేయెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా అక్కడ ఆలయాన్ని నిర్వహిస్తున్నాం. అయోధ్య మందిరంలో అర్చకులు రామానంద సంప్రదాయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ సముదాయంలో ఇంకా చాలా ఆలయాల నిర్మాణం జరగాలి. కాబట్టి ఎంతోమంది అర్చకుల అవసరం ఉంది.
వారందరికీ రామానంద సంప్రదాయ విధానంలో శిక్షణ ఇస్తున్నాం. మొన్న ఒక్కరోజులో అక్కడ రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చారు. అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకోగలిగారు. ఎలాంటి అవరోధాలూ లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. దివ్యాంగులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ప్రభుత్వాల పెత్తనం లేకుండా ఉన్నందునే అక్కడ చక్కగా దర్శనాలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల్లో అయోధ్యలో మొదటి వార్షికోత్సవం జరుగుతుంది. కేవలం ప్రజల శ్రద్ధాసక్తులు, భక్తిశ్రద్ధలతో ఆ కార్యక్రమం జరగడానికి కారణం ఎవరి పెత్తనమూ లేకపోవడమే. దేశవ్యాప్తంగా అటువంటి వాతావరణం ఉండాలి. దేవాలయాలు శ్రద్ధాకేంద్రాలుగా ఉండాలంటే వాటిపై ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదు, హిందువుల తమ భక్తిశ్రద్ధలతో ఆలయాలను చక్కగా నిర్వహించుకోగలరు. జై శ్రీరాం.