దేవాలయాలలోని పవిత్ర సాత్విక వాతావరణాన్ని ప్రతిఫలించేలా, హిందువుల స్వాభిమానం జాగృతమయ్యేలా, అష్టదిక్కులూ పిక్కటిల్లేలా సాధుసంతుల శంఖనాదంతో ‘హైందవ శంఖారావం’ కార్యక్రమం గన్నవరంలో వేడుకగా ప్రారంభమైంది. వేద పండితులు మంగళాశీర్వచనాలు అందజేస్తుండగా గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజి జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని శుభారంభం చేసారు. జ్యోతిప్రజ్వలనం అనంతరం భారతమాతకు ప్రణమిల్లి పుష్పమాల సమర్పించారు. ఓంకార నినాదం చేసి, ఏకాత్మతా మంత్రాన్ని జపించి, శ్రీరామనామ తారకమంత్రాన్ని 11 సార్లు స్మరించారు.
కార్యక్రమానికి 150 మందికి పైగా సాధుసంతులు హాజరయ్యారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి, రాధామనోహర్ దాస్ స్వామి, ఇస్కాన్, అక్షయపాత్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వారికి వేదవిహితంగా పూర్ణకుంభంతో స్వాగత సత్కారాలు నిర్వహించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హిందువులు జాగృతం కావాలంటూ బుర్రకథ, వీర శివాజీ జీవిత చరిత్ర నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరింపజేసాయి