దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ విజయవాడ సమీపంలోని గన్నవరంలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా ప్రజలు బహిరంగ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచీ సభలో పాల్గొనడానికి వివిధ మార్గాల్లో వస్తున్న వారంతా క్రమంగా తమకు కేటాయించిన స్థానాల్లోకి చేరుకుంటున్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామ, శ్రీకృష్ణ, పరమ శివ స్తుతులతో కూడిన ప్రార్థనాగీతాలు, భజనలతో గీతాలాపనలు, నాట్యప్రదర్శనలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హైందవ శంఖారావం ధ్యేయగీతం (థీమ్ సాంగ్) ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది. ఇస్కాన్ విజయవాడ వారు ఇటీవలి గీతాజయంతి సందర్భంగా భగవద్గీత ప్రచారం కోసం ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ గీతాన్ని హైందవ శంఖారావం వేదికగా ఆవిష్కరించారు.
యువతలో శ్రీకృష్ణుడి స్ఫూర్తిని నింపుతూ ధార్మిక పరిరక్షణకు అంకితం కావలసిన బాధ్యతను గుర్తుచేస్తూ సాగిన గీతం సభలో పాల్గొంటున్న ప్రేక్షకులనే కాక టీవీ, సోషల్ మీడియా ద్వారా హైందవ శంఖారావం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరినీ ఉత్తేజితులను చేసింది.
హైందవ శంఖారావం సభకు చేరుకునేందుకు నిర్వాహకులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 9 ప్రత్యేక రైళ్లు, 2 వేలకు పైగా బస్సులు ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాల వారు సొంత వాహనాలపై చేరుకుంటున్నారు. 3 వేల మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.