ఐదు టెస్టుల సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకున్న ఆసీస్
WTC ఫైనల్ లో తలపడనున్న ఆసీస్, దక్షిణాఫ్రికా
బోర్డర-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ నేటితో ముగిసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి ఐదో టెస్ట్ లో ఆసీస్, భారత్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 3-1తేడాతో కైవసం చేసుకుంది.
సిడ్నీ మ్యాచ్‌లో భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 27 ఓవర్లలో4 వికెట్లు నష్టపోయి సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా(41), ట్రావిస్ హెడ్(34), వెబ్‌స్టర్ ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. మూడో రోజులో ఆటలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, గాయం కారణంగా బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు.
మూడో రోజు ఆట ఇలా...
మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా బౌలింగ్ ను ప్యాట్ కమ్మిన్స్ ప్రారంభించాడు. ఓవర్ నైట్ స్కోర్ 141/6 తో రవీంద్ర జడేజా(8), వాషింగ్టన్ సుందర్(6) క్రీజులోకి వచ్చారు. అయితే మూడో రోజు ఆటలో పింక్ జెర్సీతో భారత ఆటగాళ్ళు మైదానంలో అడుగుపెట్టారు.
అయితే రవీంద్ర జడేజా ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. 13 పరుగులు మాత్రమే చేసి ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 35 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది.
ఆ తర్వాత సుందర్(12 ) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బూమ్రాను బోలాండ్ వెనక్కి పంపడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ కు అదనంగా కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది.
దీంతో ఆస్ట్రేలియా ముందు 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఉంచింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ ఆరు వికెట్లు తీయగా, కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్ ఇన్నింగ్స్ ఇలా…
భారత్ విధించిన 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా చేధించింది.
సామ్ కాన్‌స్టాస్ రూపంలో తొలి వికెట్ ను ఆస్రేలియా నష్టపోయింది. కాన్‌స్టాస్(22) ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో నాలుగు ఓవర్లకు ఆసీస్ ఒక వికెట్ నష్టపోయి 39 పరుగులు చేసింది.
ఆ తర్వాత లబుషేన్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. లబుషేన్(6), ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆసీస్ 52 పరుగులు వద్ద రెండో వికెట్ నష్టపోయింది.
మూడో వికెట్ కూడా ప్రసీధ్ క్రిష్ణనే తన ఖాతాలో వేసుకున్నాడు. స్టీవ్ స్మిత్(4) ను పెవిలియన్ చేర్చాడు. దీంతో లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది.
ఉస్మాన్ ఖావాజా(41).. సిరాజ్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో ఆసీస్ నాలుగో వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత భారత్ కు వికెట్ దక్కలేదు. ట్రావిస్ హెడ్, వెబ్ స్టర్ కలిసి ఆసీస్ ను విజయం వైపు నడిపించారు. 27 ఓవర్లలో ఆసీస్ నాలుగు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ట్రావిస్ హెడ్ ( 34), వెబ్ స్టర్ (39) అజేయంగా క్రీజులో ఉన్నారు.