ఛత్తీస్‌గఢ్ బస్తర్ అటవీ ప్రాంతం మరోసారి కాల్పులతో ఉలిక్కిపడింది. శనివారం పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.
అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసు బలగాలు జరిపిన ఆపరేషన్లో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో బలగాలు ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మూడు జిల్లాల బలగాలు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన కొనసాగిస్తోండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మవోయిస్టులు చనిపోయారు. డీఆర్‌జి హెడ్ కానిస్టేబుల్ కరమ్ ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.