శ్రీశైల మహాక్షేత్ర పాలక మండలి, స్వామివారి స్పర్శ దర్శన సమయం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనంలో మార్పులు చేస్తున్నట్లు ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండే రోజుల్లో స్పర్శ దర్శన సమయాలను మార్పు చేసినట్లు వివరించారు.
ప్రతీ శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో కేవలం రెండుమార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు. రద్దీ రోజుల్లో ఉదయం 7.30 గంటలకు, రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తారు. ఇతర సమయం అంతా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని స్పష్టం చేశారు.
గతంలో అమలులో ఉన్న మధ్యాహ్న కాలపు స్పర్శ దర్శనం రద్దీ రోజుల్లో పూర్తిగా నిలిపివేశారు. స్పర్శ దర్శనం ఒక్కొక్క విడతలో కేవలం 500 టికెట్లు మాత్రమే జారీ చేయనుండగా , వీటిని ఆన్ లైన్ లో పొందాల్సి ఉంటుంది.
శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో ఆర్జిత కుంకుమార్చనలు , అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు. రూ.1,000 సేవా రుసుముతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.