ఉత్తరప్రదేశ్ లో జనవరి 13 నుంచి జరగనున్న మహాకుంభ మేళలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళలో సెక్టార్ 6లో వాసుకి ఆలయం పక్కన శ్రీవారి నమూనా ఆలయాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
ప్రయాగ్‌రాజ్ లో ఉత్తరాధి భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా తిరుమల నమూనా ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. తిరుమల తరహాలో శ్రీవారి కళ్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు నిర్వహిస్తారని వివరించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్ప అలంకరణలు ఉండాలని టీటీడీ సిబ్బందికి సూచించారు.
మహాకుంభమేళా విశేషాలను ఎస్వీబీసీ ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.