ఐఐటీ బాంబే కంప్యూటర్ ల్యాబ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టాడు. మంటల్లో కంప్యూటర్లు, ఏసీలు, ప్రాజెక్టర్, కుర్చీలు కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిసెంబర్ 31 రాత్రి చిన్నపాటి సెలబ్రేషన్ జరిగింది. ఆ సమయంలో పొవాయ్‌లోని కంప్యూటర్ ల్యాబ్‌లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. పరికరాలపై కిరోసిన్ పోసి ల్యాబ్‌కు నిప్పు అంటించి పారిపోయాడు.
మంటలు గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఆరు కంప్యూటర్లు, రెండు ఏసీలు, ఒక ప్రొజెక్టర్, స్క్రీన్, నాలుగు కుర్చీలు కాలిపోయినట్లు తేలింది. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు.
నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు, సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.