వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఐపీవోలు, లిస్టింగుల జాతర జరగనుంది. వారంలోనే 7 పబ్లిక్ ఇష్యూలు, మరో ఆరు కంపెనీల లిస్టింగ్ కానున్నాయి. దీంతో వచ్చే వారం పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్లు లాభాలు పంచుతాయా, నష్టాల్లో ముంచుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ కంపెనీ జనవరి 6న ఐపీవోకు రానుంది. జనవరి 8న ముగుస్తుంది. ఇది ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్ లైనింగ్ పరికరాలు తయారు చేస్తుంది. అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ ఉపకరణాలు కూడా తయారు చేస్తోంది. ఐపీవో ద్వారా రూ.410.05 కోట్లు సమీకరించాలని నిర్ణయించారు.
పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.210 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.200 కోట్ల విలువైన షేర్లు జారీ చేస్తారు. రిటైలర్లు ఒక్కో స్లాటు బుకింగ్ కోసం కనీసం రూ.14980 పెట్టాల్సి ఉంటుంది.
క్యాపిటల్ ఇన్ఫ్రా రూ.1578 కోట్లు, క్వాండ్రండ్ ఫ్యూచర్ రూ.290 కోట్లు సమీకరించుకునేందుకు ఐపీవోకు రానున్నాయి. ఎస్ఎంఈ విభాగంలో ఇండెబెల్ ఇన్సులేషన్ లిమిటెడ్ రూ.10.14 కోట్లు, బీఆర్ గోయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.85.21 కోట్లు, డెల్టా ఆటో క్రాప్ లిమిటెడ్ రూ.54.60 కోట్లు, అవాక్స్ అపెరల్స్ అండ్ ఆర్నమెంట్ లిమిటెడ్ రూ.1.92 కోట్లు సమీకరించనున్నాయి. ఈ ఐపీవోలు జనవరి 7న మొదలై 9న ముగియనున్నాయి.
లిస్టింగుల విషయానికి వస్తే ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్, టెక్నికెమ్ ఆర్గానిక్ లిమిటెడ్, లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసస్, పరమేశ్వర్ మెటల్, ఫ్యాబ్ టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్ ఐపీవోలు వచ్చే వారం లిస్ట్ కానున్నాయి.