భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనం
గోదావరి నదిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయానికి ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలను అధ్యయనం చేయనుంది.2022లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా భద్రాచలం మునిగిపోయింది. ఆ సమయంలో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని అధికారులు సీఎంకు లెక్కలతో వివరించారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కూడ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ తరఫున అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు,కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు.