గ్రామీణప్రాంతాల్లో అభివృద్ధి ఘనత బీజేపీదే
దిల్లీలో గ్రామీణ మహోత్సవం -2025 ప్రారంభించిన ప్రధాని మోదీ
ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాభివృద్ధికి పట్టుకొమ్మలైన గ్రామీణప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని దుయ్యబట్టిన ప్రధాని మోదీ, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా గ్రామీణ భారతంలో పేదరికం తగ్గిందన్నారు.
దిల్లీలో నేడు నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం -2025 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రధాని మోదీ, వెనకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా గ్రామాలకు, పట్టణాలకు మధ్య అంతరం పెరగడం ఆందోళనకరమన్నారు.
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ఎన్డీయే పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని, సమాజ సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మారుమూల గ్రామాల ప్రజలను దేశాభివృద్ధిలో భాగం చేయడమే లక్ష్యంగా తమ సర్కార్ కృషి చేస్తోందన్నారు.
డిజిటల్ టెక్నాలజీ సహాయంతో దేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఆసుపత్రులను మారుమూల గ్రామాలకు అనుసంధానం చేశామన్నారు. పీఎం-కిసాన్ పథకం ద్వారా, రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం దాదాపు 26 శాతం నుంచి 5 శాతానికి తగ్గిపోయిందని లెక్కలతో సహా వివరించారు.