ఆర్మీ ట్రక్కు లోయలో పడటంతో ఇద్దరు సైనికులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన జమ్ము కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో చోటు చేసుకుంది.శనివారం మధ్యాహ్నం ఎస్కే పాయెన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారులు తెలిపారు.గాయపడిన సైనికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
గత నెలలో జమ్ము కశ్మీర్ పూంచ్ జిల్లాలో ఓ ఆర్మీ ట్రక్కు 300 అడుగుల లోయలో పడిపోవడంతో ఐదుగురు సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక విచారణలో తేలింది. ఈ ఘటనల వెనుక ఎలాంటి ఉగ్ర కోణం లేదని దర్యాప్తులో తేలింది.
ప్రమాదంలో సైనికులు మరణించడంపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర సంతాపం తెలిపారు. విధుల్లో సైనికులు వీరమరణం పొందారని ఆయన విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.