ప్రభుత్వానికి భారంగా ‘శక్తి’ పథకం
కాంగ్రెస్ పాలకపార్టీ గా విఫలమైందని విపక్షాలు మండిపాటు
పాలనలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ పాలకపార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రజలపై మరో భారం మోపడమే. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచింది. దీంతో సామాన్యులపై ప్రయాణ ఖర్చు భారం పడింది.
శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.
కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(KSRTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(KWKRTC), కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(KKRTC), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(BMTC)ల్లో బస్సు టికెట్ల చార్జీలను పెంచుతున్నట్టు మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. నిర్వహణ ఖర్చులు, డీజిల్ ధరలు పెరిగినందునే చార్జీలు పెంచినట్లు వివరించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగగా, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ‘శక్తి’ పేరుతో కాంగ్రెస్ గ్యారెంటీని ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ ఈ గ్యారెంటీ, రాష్ట్ర ఖజానాకు భారంగా మారింది. నవంబర్ నాటికి నాలుగు ఆర్టీసీలకు ప్రభుత్వం రూ.1,694 కోట్లు బకాయి పడింది. దీంతో ఆర్టీసీలు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి.
ఉచిత బస్సు పథకం ప్రభుత్వానికి భారం కావడంతో ఎత్తివేసే ప్రయత్నాలు జరిగాయి.