ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న ఉచిత భోజన పథకం ప్రారంభమైంది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని ఐటీ, విద్యామంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఏడాదికి రూ.28 కోట్లతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న ఉచిత భోజనం అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజన పథకాన్ని నిలిపివేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటోన్న 2 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది. విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ కళాశాలలకు వస్తున్నారని, వారు ఉదయాన్నే భోజనాలు తీసుకురాలేక, మధ్యాహ్నం పస్తులు ఉంటున్నట్లు తనకు తెలియగానే బడ్జెట్ కేటాయింపులు లేకపోయినా అధికారులతో చర్చించి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ చెప్పారు.
డొక్కా సీతమ్మ ఉచిత మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. కళాశాలల్లో ల్యాబులను అత్యాధునికంగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. విద్యార్థులకు కళాశాలల వద్దే వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేశినేని శివనాథ్ పొల్గొన్నారు.