త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితాను విడుదల చేసింది. మొత్తం 70 సీట్లలో 29 స్థానాలకు అభ్యర్ధులను ఆ జాబితాలో ప్రకటించింది.
ఢిల్లీ శాసనసభకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకూ అభ్యర్ధులను ఇప్పటికే ప్రకటించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనతో తలపడడానికి మాజీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను బీజేపీ మోహరించింది. కేజ్రీవాల్‌పై పోటీకి తనను ఎంపిక చేసినందుకు పర్వేష్ బీజేపీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు.
‘‘కోవిడ్ సమయంలో ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు కేజ్రీవాల్ మద్యం పంచిపెట్టారు. ఢిల్లీలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. యమున ప్రక్షాళన, కాలుష్య నియంత్రణ వంటివి. బీజేపీ అధికారంలోకి వస్తే మేం ఆ పనులన్నీ చేస్తాం’’ అని పర్వేష్ వర్మ చెప్పారు.
ఢిల్లీ మాజీ మంత్రి, కేజ్రీవాల్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు అయిన కైలాష్ గెహ్లాట్ కొన్ని నెలల క్రితం ఆప్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఆయన ఇప్పుడు బిజ్వాసన్ స్థానం నుంచి పోటీ చేస్తారు.
2024 వరకూ దక్షిణ ఢిల్లీ ఎంపీ అయిన రమేష్ బిధూరీ, కల్కాజీ నియోజకవర్గంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీపై పోటీ చేస్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అల్కా లాంబాను నిలబెట్టింది.
2003 నుంచి 2013 వరకూ షీలా దీక్షిత్ క్యాబినెట్లో మంత్రిగా చేసిన అర్విందర్ సింగ్ లవ్లీ గతేడాది కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఆయన ఇప్పుడు తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు.
ఆమ్ ఆద్మీ పార్టీ 2015 నుంచీ అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు గొప్ప మెజారిటీ సాధించింది. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు, మొత్తం ఏడు స్థానాలూ కమలమే గెలుచుకుంది.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టంచేసారు.
ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్యనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతంలో 15ఏళ్ళు వరుసగా అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, గత రెండు ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ గెలిచే అవకాశం కనిపించడం లేదు.