విజయవాడ శివార్లలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి పరిశీలించారు.
దేవాలయాలకు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆ ఏర్పాట్లను చూసేందుకు పురందరేశ్వరిని విహెచ్పి నేతలు ఆహ్వానించారు. ఆ సందర్భంగా సభకు హాజరయ్యేందుకు వచ్చే వారికి చేస్తున్న ఏర్పాట్ల గురించి పురందరేశ్వరి అడిగి తెలుసుకున్నారు.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, పురందరేశ్వరికి వివరాలు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి రైళ్ళలో, బస్సుల్లో, ప్రత్యేక వాహనాల్లో వచ్చేవారు ఏ విధంగా వస్తున్నారు, వారికి ఏర్పాట్లు ఎలా చేసారు అనే విషయాలను రవికుమార్ వివరించారు.
పురందరేశ్వరి వెంట బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, నూతల పాటి బాల తదితరులు పాల్గొన్నారు.