ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 88 సంవత్సరాల డాక్టర్ రాజగోపాల చిదంబరం 5 దశాబ్దాల పాటు అణురంగంలో సేవలు అందించారు. ముంబైలోని జస్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. పోఖ్రాన్ అణుపరీక్షల్లో డాక్టర్ రాజగోపాల చిదంబరం కీలక పాత్ర పోషించారు.
మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సీ పూర్తి చేసిన చిదంబరం, 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ పొందారు. 1975లో పోఖ్రాన్ 1, 1998లో పోఖ్రాన్ 2 అణుపరీక్షల్లో చిదంబర కీలక పాత్ర పోషించారు. ముంబైలోని బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌గా కూడా సేవలు అందించారు. కేంద్ర అణ విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. డాక్టర్ రాజగోపాల సేవలకు కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
డాక్టర్ రాజగోపాల మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక దార్శనికుడిని కోల్పోయిందని సంతాపం తెలిపారు. డాక్టర్ చిదంబరం రక్షణ శాఖకు అందించిన సేవలను ప్రముఖులు కొనియాడారు. ఆయన అంత్యక్రియలు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు.