చైనాలో డ్యామ్ల వల్ల దిగువన బ్రహ్మపుత్రానది ప్రవహించే భారతదేశపు రాష్ట్రాలకు సమస్య కలిగించకుండా ఉండాలని భారత ప్రభుత్వం చైనాను కోరింది. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
టిబెట్లో బ్రహ్మపుత్రా నదిని ‘యార్లుంగ్ సాంగ్పో’ అని పిలుస్తారు. ఆ టిబెట్ ఇప్పుడు చైనా అధీనంలో ఉంది. ఆ నది ఎగువ ప్రాంతంలో చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది.
చైనా డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన వార్తలు రాగానే భారతదేశంలోని బ్రహ్మపుత్ర దిగువ పరీవాహక ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సామాన్య ప్రజలు మొదలుకొని వ్యూహాత్మక నిపుణుల వరకూ అందరూ ఆందోళన వ్యక్తం చేసారు. చైనా డ్యామ్ నిర్మాణం బంగ్లాదేశ్ పైన కూడా ప్రభావం చూపుతుంది.
టిబెట్ ప్రాంతంలో ‘యార్లుంగ్ సాంగ్పో’ నది మీద చైనా హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మిస్తుందని 2024 డిసెంబర్ 25న ఆ దేశం ప్రకటించింది. ఆ విషయాన్ని భారత్ గమనించిందని మన విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేసారు. ఆ పరిస్థితిని భారత్ నిశితంగా గమనిస్తోందనీ, దేశీయ ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటుందనీ వెల్లడించారు.
నదికి దిగువన ఉన్న దేశంగా ఆ నదీజలాలను వాడుకునే హక్కు భారతదేశానికి కూడా ఉంది. శాస్త్రీయ నిపుణుల ద్వారా, దౌత్యమార్గాల ద్వారా భారత తన హక్కుల గురించి చైనాకు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ నదిమీద ఎగువ ప్రాంతాల్లో మెగా ప్రాజెక్టులు చేపట్టడంపై భారత్ ఆందోళనలను, అభిప్రాయాలనూ చైనాకు వెల్లడించాం’’ అని రణధీర్ జైస్వాల్ వివరించారు.
బ్రహ్మపుత్రానది భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఆ రాష్ట్రానికి జీవదాయినిగా (అస్సాం లైఫ్లైన్) పేరుగాంచింది. టిబెట్ ప్రాంతంలో ఆ నదిమీద డ్యామ్ కడితే అస్సాంకు భారీ నష్టం కలుగుతుంది. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జనవరి 1నాడు తన ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు.