ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలకు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
దేశంలోనే మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా 90 శాతమంది తెలుగు మాట్లాడతారని వారికి ప్రభుత్వ పాలనలో పారదర్శకతను తెలిపేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తెలుగు భాష, సాంస్కృతిక వారసత్వాలకు సముచిత గౌరవం ఇచ్చేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
జీవోలను ఆంగ్లం, తెలుగు భాషలలో అప్‌లోడ్ చేసేందుకు ఐటీశాఖ తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపిన ప్రభుత్వం, అందుకు అవసరమైన మూడు రకాల ఐచ్ఛికాలను సూచించింది. మొదట ఆంగ్లంలో జీవోను అప్‌లోడ్ చేస్తే, ఒకటి రెండు రోజుల్లో అదే జీవోను తెలుగులో అందుబాటులోకి తేవాలని తెలిపింది. మొదట తెలుగులో జీవోను పెడితే, తర్వాత ఆంగ్లంలో అప్‌లోడ్ చేయాలని సూచించింది. మూడో ఐచ్ఛికంగా రెండుభాషల్లోనూ ఒకేసారి జీవోలను అప్‌లోడ్ చేసే వెసులుబాటు ఉండాలని తెలిపింది. ప్రభుత్వ తాజాగా జారీ చేసిన జోవోను రెండు భాషల్లోనూ జారీ చేయడం విశేషం.
ప్రభుత్వ ఉత్తర్వుల అనువాదానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలు వినియోగించాలని ఉత్తర్వుల్లో తెలిపింది.