రాష్ట్రాల్లో పనిచేసే కేంద్రప్రభుత్వ ఉద్యోగుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అక్కరలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
జస్టిస్ సిటి రవికుమార్, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం గురువారం నాడు ఈ విషయం స్పష్టం చేసింది. ఇద్దరు కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా విచారణకు రాష్ట్రప్రభుత్వ అనుమతి లేదంటూ సిబిఐకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దానికి రాష్ట్రప్రభుత్వం ఆమోదం లేదంటూ వారు ఏపీ హైకోర్టులో సవాల్ చేసారు. ఉమ్మడి ఏపీలో అప్పటి రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సాధారణ ఆమోదం రాష్ట్ర విభజన తర్వాత చెల్లబోదంటూ వారు వాదించారు. దాంతో వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకూడదంటూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 1990లో నాటి రాష్ట్రప్రభుత్వం జనరల్ కన్సెంట్ ఇచ్చిందనీ, ఆ ఆమోదానికి సంబంధించిన ఉత్తర్వులను తరువాతి కాలంలో పొడిగిస్తూ ఎఫ్పటికప్పుడు జీవోలు జారీ అయ్యాయనీ స్పష్టం చేసింది. అంతేకాక, కేంద్రప్రభుత్వ ఉద్యోగిపై కేంద్ర చట్టాన్ని అనుసరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి రాష్ట్రప్రభుత్వం ఆమోదం అవసరమే లేదని తేల్చిచెప్పింది. సదరు ఉద్యోగి ఒక రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదుకు అది అడ్డం కాబోదని వివరించింది. అలాంటి కేసుల్లో రాష్ట్రప్రభుత్వం ఆమోదం గురించి హైకోర్టు వ్యాఖ్యానించడంలో పొరపడిందని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది.
వివిధ రాష్ట్రాల్లో పనిచేసే కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ విచారణ జరపాలంటే దానికి రాష్ట్రప్రభుత్వ అనుమతి ఉండాలి. అయితే ఒక్కొక్క కేసులో ఒక్కొక్కసారి అనుమతి ఇవ్వడం లాంటి సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు రాష్ట్రప్రభుత్వాలు జనరల్ కన్సెంట్ ఇస్తాయి. దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ ఉంటాయి. అయితే జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నప్పుడు సీబీఐ ప్రతీ కేసులోనూ విడివిడిగా అనుమతి కోసం అడగాలి. అలాంటప్పుడు రాష్ట్రాలు కేసును బట్టి అనుమతికి నిరాకరించే అవకాశముంది.
గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నాయి. 2018 నవంబర్‌లో నాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎన్‌డిఎ నుంచి వైదొలగినప్పుడు సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించింది. అయితే 2019 జూన్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జనరల్ కన్సెంట్‌ను పునరుద్ధరించింది.