డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవ్ పార్టీ కలకలం రేపింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన రేవ్ పార్టీ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. రేవ్ పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును సుమోటాగా తీసుకుని, 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు కొమ్ము రాంబాబు వైసీపీ నాయకుడు కావడం గమనార్హం.
ప్రధాన నిందితుడు రాంబాబు మండపేట మునిసిపాలిటీ ఛైర్మన్‌కు సమీప బంధువు. మండపేటలోని గొల్లపుంత వెళ్లే రహదారిలోని రాంబాబుకు సమీప బంధువుల లేఅవుట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబరు 3న జరిగిన రేవ్ పార్టీల్లోట్రాన్స్ జెండర్లు, యువతుల నృత్యాలతోపాటు, వ్యభిచారం నిర్వహించారని పోలీసులు గుర్తించారు.
రేవ్ పార్టీలో మత్తు పదార్ధాలు ఉపయోగించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో గంజాయి ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. రేవ్ పార్టీకి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో అరాచకం వెలుగులోకి వచ్చింది.