చైనాలో ప్రబలిన కొత్త వైరస్‌పై భారత కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆరోగ్య సేవల సంస్థ (DGHS) స్పందించింది. చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి పై భయం అవసరం లేదని తెలిపింది. డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు అవసరమన్నారు.
చైనాలో వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపీవీ వైరస్ సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుందని వివరించారు. వృద్ధులు, పిల్లలపై ఫ్లూ వంటి లక్షణాలను చూపిస్తుందని తెలిపారు. మనదేశంలో శ్వాసకోశ సంబంధిత వైరస్ వ్యాప్తికి సంబందించిన డేటాను విశ్లేషించగా ఎలాంటి గణనీయమైన పెరుగుదల కన్పించలేదన్నారు. శీతాకాలంలో ఎదురయ్యే శ్వాసకోస సంబంధిత ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో అవసరమైన సామగ్రి, బెడ్స్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపినట్లు వివరించారు.
దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు అందరిలో కలవకపోవడమే ఉత్తమన్నారు. దగ్గు, తుమ్ము వస్తే కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలన్నారు. జలుబు, జ్వరం వంటివి ఉంటే వైద్యుడిని సంప్రందించి సరైన చికిత్స తీసుకోవాలని తెలిపారు.
హెచ్ఎంపీవీ వైరస్ విషయమై వస్తోన్న కథనాల్లో వాస్తవం లేదని చైనా తెలిపింది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత సహజమేనని కొట్టిపారేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తీవ్రత తక్కువగా ఉందని లెక్కలు వెల్లడించింది.
విదేశీయులు తమ దేశంలో పర్యటించేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించింది. ప్రతీ ఒక్కరి ఆరోగ్యం పట్ల చైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు.