హిందూధర్మానికి స్వతంత్రం కోసం చేపట్టిన పోరాటానికి నాందీప్రస్తావన విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో జరగబోయే హైందవ శంఖారావం బహిరంగ సభ అని విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి, హైందవ శంఖారావం కన్వీనర్ తనికెళ్ళ సత్యరవికుమార్ అన్నారు. అంతటి మహత్తరమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభం కావడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, విహెచ్పి చరిత్రలో కూడా సువర్ణాధ్యాయం అన్నారు.
ఆదివారం జరగబోయే హైందవ శంఖారావం బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ బాధ్యులు ఇవాళ పాత్రికేయులతో మాట్లాడారు. ఆ సందర్భంగా తనికెళ్ళ సత్య రవికుమార్ పలు విషయాలు తెలియజేసారు.
‘‘హైందవ శంఖారావం బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, విశ్వహిందూ పరిషత్ చరిత్రలో కూడా ఒక సువర్ణ ఘట్టం. అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం ప్రయత్నం చేసాం, ఉద్యమం చేసాం, దేశం మొత్తం ఏకత్రితం చేసాం. అది అయోధ్య ఆలయానికి సంబంధించిన ఉద్యమం. అమరనాథ్ ఉద్యమం చేసాం, అది అమరనాథ్ దేవాలయానికి సంబంధించిన ఉద్యమం. రామసేతు ఉద్యమం చేసాం, అది రామసేతువును ధ్వంసం చేయకుండా ఆపడం కోసం చేసిన ఉద్యమం. ఇప్పుడు చేస్తున్న ఉద్యమం ఆసేతుశీతాచలం యావత్ భారతదేశంలో విస్తరించి ఉన్న దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం చేపట్టిన మహోద్యమం. ఇది మరో ధార్మిక స్వతంత్ర పోరాటానికి నాంది. ఈ కార్యక్రమం విజయవాడలో జరగడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. యావద్దేశంలో ఉన్న దేవాలయాలకు స్వతంత్రం రావాలన్నది మన ఉద్దేశం తప్ప అధికార వికేంద్రీకరణ కాదు. దేవాలయాలు, పురాణ గ్రంథాలు, గోమాతలు, భూమాత, మాతృమూర్తులు అనేవి హిందువులకు అత్యంత శ్రద్ధా కేంద్రాలు, సంస్కార కేంద్రాలు, మానబిందువులు, ప్రాణబిందువులు. వాటి సంరక్షణ కోసం ఎంతోమంది బలిదానాలు చేసారు. ఎందరో హిందువులు ఆత్మార్పణ చేసారు. కరకు బులెట్లకు బలైపోయారు. లాఠీ దెబ్బలకు, తుపాకీ కాల్పులకు ప్రాణాలు త్యజించారు. ఉరికంబాలెక్కి ఊపిరులు విడిచారు. వారి త్యాగాలకు కారణం కేవలం అధికారం పొందాలన్న ఉద్దేశం కాదు. దేవాలయాలను, ఈ సంస్కృతిని, ధర్మాన్నీ కాపాడుకోవడం కోసమే. దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా రాజ్యాంగంలో 12, 25, 26 అధికరణలు దేవాలయ వ్యవస్థలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు ఆలయాలను స్వాధీనం చేసుకోకూడదు అని చెబుతున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభుత్వాలు గత 77 ఏళ్ళుగా దేవాలయాలను లూటీ చేస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే చెందిన ఉద్యమం కాదు. ఇది యావత్ భారత జాతికీ సంబంధించిన ఉద్యమం. ఆనాడు అయోధ్య ఉద్యమం జాతీయ స్థాయిలో చేసినా దానికి అంకురార్పణ బిహార్‌లో జరిగింది. సీతామఢి నుంచి అయోధ్య వరకూ రామజానకీ రథయాత్రల ద్వారా ఉద్యమం ప్రారంభమైంది. కంచి స్వామిని అరెస్ట్ చేసినప్పుడు ఉద్యమం ఇచ్ఛాపురంలో ప్రారంభించాం. అక్కడినుంచి కంచి వరకూ ఉద్యమం జరిగింది. ఏడు కొండలూ నిలబెట్టుకోవడం కోసం దేవాలయ సంరక్షణ ఉద్యమం చేసాం. అలా ప్రతీ కార్యక్రమమూ ఏదో ఒక చోటినుంచి మొదటి అడుగుతోనే ప్రారంభమయ్యాయి. ఇవాళ భారతదేశంలో దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించే ధర్మ స్వతంత్ర పోరాటానికి మొదటి అడుగు విజయవాడలో పడుతోంది’’ అని సత్య రవికుమార్ చెప్పారు.
ఆలయాల స్వయంప్రతిపత్తి సాధించే పోరాటానికి ఆలంబనగా విశ్వహిందూ పరిషత్ కార్యాచరణను రవికుమార్ ఇలా వివరించారు. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లనూ కలిసి ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించండి, ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం సెక్యులరిజానికి విరుద్ధం అని కోరాము. దేవాలయానికి డబ్బులివ్వమంటే అది మతపరమైన కార్యక్రమం కాబట్టి డబ్బులు ఇవ్వబోమని చెబుతున్నారు. కానీ పాస్టర్లకూ ముల్లాలకూ డబ్బులు ఇస్తున్నారు. జీర్ణమైపోయిన దేవాలయాలను పునరుద్ధరించుకుంటామంటే ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు. అర్చకులకు దక్షిణ ఇవ్వాలంటే ఎండోమెంట్స్ హుండీ నుంచి ఇస్తున్నారు, ప్రజల పన్నుల నుంచి ఇవ్వడం లేదు. బెత్లెహాం యాత్రలకు, జెరూసలేం యాత్రలకు మాత్రం దేశప్రజలు కడుతున్న పన్నుల నుంచి ఇస్తున్నారు. ఈ వ్యవస్థ మారాలి. సెక్యులరిజం అంటే హిందువులను ఉపేక్షించడం, అన్యమతాలకు అన్ని సౌకర్యాలూ అందించడం కాదు. ఏ మతంలోనూ జోక్యం చేసుకోకపోవడం, ఏ మతానికీ తాయిలాలు ఇవ్వకపోవడం సెక్యులరిజం. తమ మతాన్ని తామే నిర్వహించుకునే స్వేచ్ఛనివ్వడం. అది జరగకపోవడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా పరిగణిస్తోంది. పూజ్య స్వామీజీలు, ధర్మాచార్యుల అనుగ్రహంతో వారి మార్గదర్శనంలో ఈ ధర్మపోరాటం ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాల గవర్నర్లకూ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడంతో మొదలైంది’’ అని చెప్పారు.
ఆలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కోసం ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌నుంచే మొదలుపెట్టడానికి కారణాన్ని రవికుమార్ వివరించారు. ‘‘ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కావలసిన వాతావరణం తిరుమల వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదించింది. తిరుమల వేంకటేశ్వరుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాడని ఎంత గర్వపడతామో ఆ తిరుమల లడ్డూ అపవిత్రమైంది అని మన ముఖ్యమంత్రిగారు చెప్పినప్పుడు అంత వేదనకు గురయ్యాము, అంత అవమానంగా భావించాము. అది జరిగిందా లేదా అన్న నిర్ధారణ జరుగుతుంది, దానికి సంబంధించిన న్యాయ విచారణ జరుగుతుంది. విశ్వహిందూ పరిషత్ దానిజోలికి వెళ్ళడం లేదు. కానీ ఆ దుర్ఘటన వల్ల హిందువుల్లో వచ్చిన స్పందన ప్రేరణ కలిగించింది. దేవాలయాల విముక్తికి ఇది సరైన సమయం. దేవాలయాల భూములు అమ్మేసారు, మిన్నకుండిపోతున్నాం. ఆలయాల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, మిన్నకుండిపోతున్నాం. ఆలయాల్లో ఆభరణాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మాయమైపోతున్నాయి, మిన్నకుండిపోతున్నాం. దేవాలయాల ఆదాయం ప్రజాపాలనా కార్యక్రమాలకు వినియోగించేస్తున్నారు, మిన్నకుండిపోతున్నాం. దేవాలయాల్లో అన్యమతస్తులు చేరిపోతున్నారు, మిన్నకుండిపోతున్నాం. దేవాలయ ట్రస్టుల్లో నాస్తికులు వచ్చేస్తున్నారు, మిన్నకుండిపోతున్నాం. చివరికి దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోతున్నాయి, వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి. పదివేల రూపాయల టికెట్లు, ఐదువేల రూపాయల టికెట్లు, డబ్బిస్తేనే వేగంగా దర్శనం సాధ్యం అనే వాతావరణాన్ని దేవాలయ వ్యవస్థలో తీసుకొచ్చారు. భారతదేశంలో 60శాతం దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 27వేల ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. వీటన్నిటికీ ఎప్పటికి పరిష్కారం రావాలి. దేవాలయ వ్యవస్థ మొత్తం తగలబడిపోయి, మొత్తం నాశనమైపోయిన తర్వాత కళ్ళు తెరిచినా సాధించేది ఏమీ ఉండదని హిందూ సమాజం అర్ధం చేసుకుంది’’ అని వివరించారు.
కొన్నేళ్ళుగా మన రాష్ట్రంలో హిందువులను కలవరపరుస్తున్న దేవాలయాలపై దాడుల ఘటనల గురించి కూడా రవికుమార్ వివరించారు. ‘‘ఇవాళ ఈ సభ నిర్వహించడానికి మరో ప్రధాన కారణం దేవాలయాల మీద దాడులు. దేవాలయాల్లోని విగ్రహాల మీద దాడులు. దేవాలయాలను అపవిత్రం చేయడం, వినాయకుడికి మానవ మలం పూసారు. విగ్రహాలను పెట్రోలు పోసి తగులబెట్టారు. రామతీర్థంలో రాముడి శిరస్సును యంత్రాలతో ఖండించారు. ఒకేరోజు 19 దేవాలయాలు కూల్చేసారు. రథాలు తగులబెట్టారు. హిందూ సమాజం మీద దాడులు చేసారు. అనేక చోట్ల హిందువుల మీద దాడులు చేస్తే, హిందూ సమాజం బాధితులుగా ఉంటే, ఆ జరిగిన సంఘటనలను సోషల్ మీడియాలో పెడితే వారి మీద కేసులు పెట్టారు. దాడులు చేసిన వారికి రాజకీయ నాయకులు, పోలీసులు, ప్రభుత్వాలూ ఆశ్రయం ఇస్తాయి. అలాంటి వాతావరణం మారడం కోసం, హిందువులలో వచ్చిన చేతనను నిలబెట్టడం కోసం, హిందువులు తమను తాము రక్షించుకోవడం కోసం, ఆ దిశగా ప్రభుత్వాలను ఆలోచింపజేయడమూ ఈ కార్యక్రమ ఉద్దేశం’’ అని చెప్పారు.
హైందవ శంఖారావం సభకు సన్నాహాలు ఎలా చేసిందీ వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ తర్వాత దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామని రవికుమార్ చెప్పారు. ‘‘ఈ కార్యక్రమాన్ని రెండు రకాలుగా చేసాము. ఒకటి జనజాగరణ, రెండు జన సమీకరణ. రెండవ దానిలో భాగంగా మూడు లక్షలకు పైగా హిందువులు ఈ బహిరంగ సభకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రైళ్ళలో, బస్సుల్లో వస్తున్నారు. 10వేల కార్లలో వస్తున్నారు, సుమారు 18వేల మోటార్ సైకిళ్ళ మీద వస్తున్నారు. అలా ఇక్కడికి 3లక్షల మంది చేరుకుంటున్నారు. ప్రతీ హిందువూ తన ఖర్చు తాను పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడకు వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నామంతే. సొంతగా ఖర్చు పెట్టుకుని వస్తున్నారంటే ఇవాళ హిందూ సమాజం ఎంత పట్టుదలతో ఉందన్న సంగతిని ప్రభుత్వాలు అర్ధం చేసుకుంటాయని భావిస్తున్నాం. మరొక్కసారి చెబుతున్నాము, ఇది జాతీయ ఉద్యమం. అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలోనూ, తమిళనాడులోనూ, ఆఖరికి జమ్మూకశ్మీర్‌లో కూడా జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు పూర్తయాక పూర్తి కార్యాచరణతో ముందుకొస్తాము. నవంబర్ 7న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసాము, ఏరకంగా చట్ట సవరణ చేయాలో నమూనా ముసాయిదా వారికిచ్చాము. చట్టపరమైన సలహా తీసుకోమని కోరాము. కాబట్టి ఇకపై ఆలోచించే, ఉపేక్షించే అవకాశం లేదు. హిందూ సమాజాన్ని 77 సంవత్సరాలు అణచిపెట్టి ఉంచారు, అది ఇక చెల్లదు’’ అన్నారు.
హిందూ సమాజం తమ దేవాలయాలు తామే నిర్వహించుకోగలరా అన్న సందేహాలు అనవసరమని రవికుమార్ కుండబద్దలు కొట్టారు. ‘‘దేవాలయాలను అప్పగిస్తే హిందువులు నిర్వహించుకోగలరా అన్న సందేహాలు అక్కర్లేదు, కచ్చితంగా నిర్వహించుకోగలం. దానికి అయోధ్యే సాక్షి. అక్కడ ప్రభుత్వం నిర్వహించడం లేదు. 1.20 లక్షల మంది వచ్చినా 30నిమిషాల్లో దర్శనం చేయిస్తున్నాం. ఏ టికెట్టూ లేదు, వీఐపీ లేడు, బ్రేక్ దర్శనాలు లేవు, ప్రసాదానికి డబ్బుల్లేవు. చెప్పులు, సెల్ ఫోన్లు, బ్యాగులు పెట్టుకోడానికి డబ్బుల్లేవు. అయోధ్యలో అన్నీ ఉచితమే. అది హిందువులు నిర్వహించుకుంటే ఉండే విధానం. అది అన్ని దేవాలయాల్లో రావాలి. అదే నిజమైన సెక్యులరిజం అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ సభ కోసం మేం 25 లక్షల కుటుంబాలను కలిసాము. కేవలం ఒక పత్రికలోనో, టీవీలోనో ప్రకటన ఇవ్వలేదు. ప్రతీ ఇంటికీ వెళ్ళాము, ప్రతీ తల్లినీ కలిసాము. అలా సుమారు కోటిమందిని జనజాగరణ చేసాము. మూడు నెలల కష్టం జనవరి 5న కనిపిస్తుంది. కాబట్టి ప్రతీ హిందువూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మన దేవాలయాలను మనం రక్షించుకోవాలనీ, మన స్వతంత్ర సమరయోధులు మనకిచ్చిన స్వతంత్ర ఫలాలను నిర్వీర్యం కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. ధర్మం ఉన్నప్పుడే ప్రపంచంలో శాంతి ఉంటుంది. ధర్మానికి మూలం దేవాలయాలు. కాబట్టి ఈ దేవాలయాల ఉద్యమాన్ని విశ్వహిందూ పరిషత్ స్వీకరించింది’’ అని ఆయన వివరించారు.
‘‘జనవరి 5న అన్ని దారులూ హైందవ శంఖారావం వైపే ఉంటాయి. కాబట్టి ఆరోజు విజయవాడకు వ్యక్తిగత పనుల మీద రావలసి ఉంటే అలాంటి ప్రయాణాలను అవకాశం ఉన్నమేరకు వాయిదా వేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. రైళ్ళు, బస్సులు కిక్కిరిసిపోయి ఉంటాయి, ట్రాఫిక్ కిక్కిరిసిపోయి ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నమేరకు జనవరి 5న వ్యక్తిగత ప్రయాణాలను తగ్గించుకోమని సూచిస్తున్నాము. ట్రాఫిక్ ఆంక్షల విషయంలో పోలీసులు అన్ని వివరాలూ అందిస్తారు. రహదారులపై ట్రాఫిక్ మళ్ళింపుల విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజల అసౌకర్యం కోసం కాదు, హిందువుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల నుంచీ ప్రజలు వస్తున్న సమాచారం మాకు అందుతోంది. బైకులు, కార్లు, బస్సులు, రైళ్ళ వివరాలు అన్నీ మాకు అందాయి. ఇది వ్యక్తిగత ఎజెండా కాదు, దేశానికీ, ధర్మానికీ, దేవాలయాలకూ చెందిన అజెండా. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఇది ప్రభుత్వాలకు వ్యతిరేకమైన కార్యక్రమం కాదు, ప్రభుత్వానికి ప్రజావాణి వినిపించడం కోసం చేస్తున్న కార్యక్రమం మాత్రమే. తొలి అడుగు విజయవాడలో పడుతోంది కాబట్టి కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహం మాకు మెండుగా ఉందని భావిస్తున్నాం’’ అని చెప్పారు.