తాను తన కోసం ఏమీ నిర్మించుకోలేదన్న ప్రధాని మోదీ, పేదల కోసం నాలుగు లక్షల ఇళ్ళు కట్టించినట్లు తెలిపారు. దిల్లీ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రధాని మోదీ, తన ప్రసంగంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చురకలు అంటించారు.
దిల్లీ సీఎం నివాసం కోసం భారీ మొత్తంలో ఖరీదైన వస్తువులు వాడారని, పబ్లిక్ వర్క్స్ శాఖ రిలీజ్ చేసిన ఇన్వెంటరీలో విస్తుపోయే లెక్కలు ఉన్నాయన్నారు. సీఎం బంగ్లా కోసం హైఎండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వాడారని దుయ్యబట్టారు.
గత పదేళ్ళుగా దిల్లీకి విపత్తు చుట్టేసిందని, అన్నాహజారేను ముందు పెట్టి, కొందరు నిజాయితీలేని వాళ్లు రాజకీయాలు చేశారన్నారు. దిల్లీ మొత్తాన్ని అధికారం మాటున దోచేసుకుంటోందని ప్రధాని విమర్శించారు.
జుగ్గి-జోప్రి అర్బన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు చెందిన 1675 ఫ్లాట్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ, అశోక్ విహార్ ఏరియాలోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్‌లో నిర్మించిన నివాస సముదాయాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఫ్లాట్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 లక్షలు ఖర్చు చేయగా, లబ్ధిదారులు మొత్తం సొమ్ములో 7 శాతం లోపే చెల్లించాల్సి ఉంటుంది.
దిల్లీ యూనివర్శిటీలో రూ.600 కోట్ల వ్యయంతో మూడు కొత్త ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
దాదాపు రూ.4,500 కోట్ల విలువైన వివిధ పథకాలను దిల్లీ ప్రజలకు కానుకగా అందించారు.