ఉత్తరప్రదేశ్లోని మహాకుంభ మేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.5వేల కోట్ల ఖర్చుతో సదుపాయాలు కల్పించింది. ఇందుకు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాట్లు చేసింది. వాతావరణశాఖ వెబ్సైట్లో ప్రత్యేక పేజీని రూపొందించారు. ఇందులో ప్రతి పావుగంటకు వాతావరణం అప్డేట్ చేయనున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతాన్ని ప్రత్యేక వాతావరణ జిల్లాగా గుర్తించి సమాచారం అందించనున్నారు. ఇక రోజుకు రెండు సార్లు వాతావరణ శాఖ మహాకుంభ మేళా ప్రాంతంలో వాతావరణంపై బులెటిన్ ఇవ్వనుంది.
ఉత్తరాదిలో చలి వణికిస్తోంది. మంచు కమ్మేస్తోంది. దీంతో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే మహాకుంభ మేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. అందుకు తగిన ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే ప్రయాగ్రాజ్లో లక్షన్నర తాత్కాలిక టెంట్లు వేశారు. రోజుకు కోటి మంది స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 50 వేల మంది బలగాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. కుంభమేళాకు వచ్చే ప్రతి వ్యక్తి ముఖచిత్రాలు తీసే విధంగా ఏర్పాట్లు చేశారు. వందలాది డ్రోన్లతో పోలీసుల పర్యవేక్షణ, 2500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కుంభమేళా ప్రాంతంలో భక్తులకు లక్షన్నర తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి 4500 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. విదేశాల నుంచి కూడా 3 కోట్ల మంది వస్తారని అంచనా.