రోహిత్ కు విశ్రాంతి, కెప్టెన్ గా బూమ్రా
తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు భారత్ ఆలౌట్
Australia vs India: బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో నేడు ఆఖరి మ్యాచ్ లో ఇరు జట్లు తలపడుతున్నాయి. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ మరోసారి పేలవంగా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మకు బదులు బూమ్రా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ కేవలం బెంచ్ కే పరిమితం అయ్యాడు. దీంతో అతడి రిటైర్మెంట్ పై జోరుగా ప్రచారం జరుగుతోంది. మ్యాచ్ అనంతరం రోహిత్, కోహ్లీ లు టెస్ట్ ఫార్మెట్ కు రిటైర్మెంటె ప్రకటిస్తారనే చర్జ జరుగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ సిరీస్ లో 31 పరుగులే సాధించాడు.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన జైస్వాల్, కేఎల్ రాహుల్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. స్టార్క్ వేసిన 4.6 బంతికి రాహుల్ (4) వెనుదిరిగాడు. దీంతో 11 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత 7.4 బంతికి జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు. బోలాండ్ బౌలింగ్ లో జైస్వాల్(10) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 17 పరుగులు వద్ద భారత్ రెండో వికెట్ నష్టపోయింది.
వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన శుభమన్ గిల్ 64 బంతులు ఆడి 20 పరుగులు చేశాడు. నాథన్ లయన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ(17) కూడా చెత్త షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.
రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జోడి క్రీజులో పాతుకుపోయేందుకు చేసిన ప్రయత్నాలను బోలాండ్ దెబ్బతీశాడు. బోలాండ్ వేసిన 56.4 బంతిని ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టాడు. దీంతో పంత్ 98 బంతులు ఆడి 40 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే పంత్ అంతకు ముందు మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో గాయపడ్డాడు.అయినా సరే నొప్పిని తట్టుకుని బ్యాటింగ్ కొనసాగించాడు.
నితీశ్ కుమార్ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి బోలాండ్ బౌలింగ్ లో ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ 134 పరుగులకు చేరిన సమయంలో రవీంద్ర జడేజా ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ క్రిష్ణ కూడా బ్యాటింగ్ లో విఫలం అయ్యారు.
స్కోర్ బోర్డ్ 185కు చేరిన తర్వత కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా ఔట్ అవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. సిరాజ్ మూడు పరుగులతో నాటౌట్ గా మిగిలిపోయాడు.
ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీయగా, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు, నాథన్ లయన్ ఒక వికెట్ తీశారు.