వ్యక్తికి సంస్కారం నేర్పడానికి, సాటి మనుషులపై సహానుభూతిని పంచడానికీ, సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేయడానికీ పుస్తకాలు సహకరిస్తాయి. అలాంటి పుస్తక ప్రదర్శనలు కొన్ని ఇజాలకు కేంద్రాలుగా మారిపోయి చాలా కాలమే అయింది. ఇప్పుడు వాటి ముసుగులు పూర్తిగా తొలగిపోయి బహిరంగంగా బల ప్రదర్శనలు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి, అభ్యుదయవాదుల ముసుగులో ఆపన్నులకు అండగా నిలుస్తున్నట్లు నటిస్తూ, దేశవ్యతిరేక భావజాలాలను ప్రచారం చేస్తూ, దానిని ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంపై దాడి అని గగ్గోలు పెట్టడానికి పుస్తక ప్రదర్శనలు వేదికలుగా నిలుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడల్లో జరిగే పుస్తక ప్రదర్శనలకు ప్రజాదరణ ఎక్కువ. పుస్తకాల అమ్మకాలు, కొనుగోళ్ళు ఎలా ఉన్నా, సినిమాలు, ఎగ్జిబిషన్లలా ప్రజలు పెద్దసంఖ్యలో సందర్శించే ప్రదర్శనలివి. సాధారణంగా డిసెంబర్ నెలాఖరులో తెలంగాణ రాజధానిలోనూ, జనవరి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ ఈ పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తారు. తాజాగా 2024 డిసెంబర్ 19 నుంచి 29 వరకూ హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరిగింది. అది పూర్తయాక 2025 జనవరి 2 నుంచి 12 వరకూ విజయవాడలో జరగనుంది.
తెలుగు ప్రసార మాధ్యమాల్లో, ప్రచురణ రంగంలో మొదటినుంచీ వామపక్ష భావజాలం కలిగిన వారిదే ఆధిక్యం. ఆ ప్రభావమే పుస్తక రచనల్లోనూ, ప్రచురణల్లోనూ ప్రతిఫలిస్తూంటుంది. వామపక్షాలకు ప్రజాదరణ తగ్గుతున్న తరుణంలో ఈ సోకాల్డ్ మేధోవర్గం అభ్యుదయవాదులుగా రకరకాల జెండాలుగా పరివర్తన చెందింది. దళిత, స్త్రీ, బహుజన, ప్రాంతీయ, అర్బన్ తదితర అస్తిత్వ వాదాలుగా, జై భీమ్, జై మీమ్ వంటి నినాదాలుగా, లాల్-నీల్- కాలా-హరా ఝండాలుగా రంగులు మార్చుకుంది. పరస్పరం సరిపడని నానాజాతుల ఈ వాదులు అందరూ ఏకమయ్యే ఒకే ఒక అజెండా… జాతీయవాదానికి వ్యతిరేకత. ఎన్నిపార్టీలుగా చీలిపోయారో తెలీని ఎర్ర వర్గాలు మొదలుకొని, అర్ధంలేని ఆవేశాలను అద్భుతమైన ఆలోచనలుగా వక్రీకరించి ప్రచారం చేసుకునే వర్గాల మీదుగా, తాము విమర్శించే ఆధునికోత్తర జీవనసరళినే అందిపుచ్చుకుని అయినా అలవాటు వదలక దాన్నే విమర్శించే అభ్యుదయ వర్గాల వరకూ అందరూ సామూహికంగా విరుచుకుపడే అంశం… జాతీయవాదం.
విప్లవం వర్ధిల్లాలి, సాయుధ పోరాటం జిందాబాద్ అనే నినాదాలనే నేటికీ ప్రచారం చేస్తూ అదేమిటని అడిగితే ప్రజాస్వామిక హక్కుల గురించి పాఠాలు చెప్పేవారు… తమ తప్పుడు ప్రచారాలను చూసి ఆ క్షణంలో ఆవేశానికి లోనై ప్రశ్నలు లేవనెత్తితే దానికి హిందుత్వ అసహనం అని ముద్ర వేసి జాతీయవాదం మీద దండయాత్ర చేస్తారు. ప్రశ్నించే హక్కు తమకు మాత్రమే ఉందనీ, ఎదుటివారికి ఆ హక్కు లేదనీ అడ్డగోలుగా వాదించి అదేమిటని అడిగిన వారిని ఆధిపత్య వర్గాలంటూ ముద్రలు వేసి వారు తమపై దాడులు చేస్తున్నారంటూ దొంగయేడుపులు యేడ్చి గోలగోల చేస్తారు. ఎక్కడో పుట్టిన మార్క్సూ ఎంగెల్సూ జీససూ మహమ్మదూ తమకు దేవుళ్ళు కావచ్చు కానీ ఇక్కడి ప్రజలకు తమ దేశం పట్ల దైవం పట్ల భక్తి ఉండకూడదు. ఆ రంగో, ఈ రంగో, మరేదో రంగో తమ చిహ్నమని చించుకునే వీరులు సామాన్య ప్రజలకు జాతీయచిహ్నాలపై ఉండే గౌరవాన్ని అపహాస్యం చేస్తారు. అలాంటి వారందరికీ ఉమ్మడిగా తమ బలాన్ని ప్రదర్శించే వేదికలుగా పుస్తక ప్రదర్శనలు మారిపోయాయి. సాహిత్యపరమైన పుస్తకాలు విక్రయించే స్టాల్స్‌లో అత్యధికం… జాతీయవాద వ్యతిరేకతే ఉమ్మడి అజెండాగా కలిగిన ఈ నానా జెండాల వారివే ఉండడం ఎప్పుడూ సాధారణంగా ఉండే సంగతే. అంతెందుకు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ బుక్ ట్రస్ట్, సాహిత్య అకాడెమీ వంటి సంస్థల్లో సైతం ఈ సోకాల్డ్ అభ్యుదయ రంగుల వాదులే యేళ్ళ తరబడి తిష్ఠవేసుకుని ఉండిపోవడంతో వాటినుంచి వెలువడే పుస్తకాలు సైతం ఆయా రంగు-రుచి-వాసనలతోనే ఉండడం విజ్ఞులైన పాఠకులకు పరిచితమైన విషయమే.
తాజాగా హైదరాబాద్‌లో ముగిసిన పుస్తక ప్రదర్శనలో ప్రధానంగా రెండు సంఘటనలు చర్చనీయాంశాలుగా నిలిచాయి. వాటిలో అసలు జరిగిన విషయాన్ని పక్కదోవ పట్టించి తమపై జాతీయవాదులు దాడి చేసారన్నట్లుగా సోకాల్డ్ అభ్యుదయవాదులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం అంతాఇంతా కాదు. తాము నిజాలను బైటపెడుతున్నామనీ, అది చూసి తట్టుకోలేక, భయపడిపోయి సంఘ్ పరివార్ సంస్థలు వాదన పేరుతో దాడులు చేస్తున్నాయనీ వారు ప్రచారం చేస్తున్నారు. తమను ఎవరు ప్రశ్నించినా వారిని సంఘ్ పరివార్‌కు చెందినవారు అంటూ ఒకేగాటన కట్టేయడం విచిత్రం. ప్రశ్నించడం ప్రజల హక్కు అని చెప్పే సోకాల్డ్ విప్లవవాదులు, తమను ప్రశ్నించేసరికి మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఒక దుర్మార్గపు ఘటనను ఖండించే పేరుతో జాతీయ గీతాన్ని అవమానించారు. అదేమిటని అడుగుతుంటే దాన్ని కూడా దాడిగా చిత్రీకరిస్తున్నారు. తమను, తమ భావజాలాన్నీ జాతీయవాదులు చంపేస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చిన నాటినుంచీ కాంగ్రెస్ అండదండలతో కమ్యూనిస్టులు, ఇతర భావజాలాల వారూ హిందూధర్మంపై సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ముసుగు దాడులు చేస్తూ వచ్చారు. చరిత్రను వక్రీకరించి, సాహిత్యానికి రంగులు పులిమారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత ప్రజాస్వామిక పాలనలో సాహిత్య, ప్రసార మాధ్యమాలను గుప్పెట్లో పెట్టుకున్న వారి నాటకాలు ఇప్పుడు వన్నెలు వెలిసిపోయి బైటపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. జాతీయవాదాన్ని బూచిగా చూపిస్తూ దేశ సంస్కృతిపై విషప్రచారం చేస్తూ తమ బల ప్రదర్శనకు పుస్తక ప్రదర్శనలను వేదికలుగా చేసుకుంటున్నారు.