అమెరికాలో జనవరి 1 ఉదయం ఒక వ్యక్తి తన పికప్ ట్రక్‌ను ఉద్దేశపూర్వకంగా జనాల గుంపు మీదకు పోనిచ్చాడు. ఆ దాడిలో కనీసం 15మంది చనిపోయారు, మరో 30మంది గాయాల పాలయ్యారు.
ఈ సంఘటన న్యూ ఆర్లేన్స్ నగరంలోని ఫ్రెంచ్ క్వార్టర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ దాడికి పాల్పడిన వ్యక్తి షంషుద్దీన్ జబ్బార్. 42ఏళ్ళ షంషుద్దీన్ జబ్బార్ అమెరికన్ ఆర్మీలో పనిచేసాడు.
దాడి విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికీ షంషుద్దీన్ జబ్బార్‌కూ మధ్య కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు పోలీసులు అతన్ని తుదముట్టించారు.
ఆ దాడి కోసం షంషుద్దీన్ జబ్బార్ ఉపయోగించిన ఫోర్డ్ పికప్ ట్రక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండా దొరికింది.
ఆ విషయమై దర్యాప్తు చేసిన అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ, షంషుద్దీన్ జబ్బార్ ఒంటరిగా దాడి చేయలేదని కనుగొంది. ఆ ట్రక్ నుంచి ఎఫ్‌బిఐ అధికారులు హ్యాండ్‌గన్, రైఫిల్ గన్స్, ఐఈడీలు, పైప్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ దాడికి సంబంధించి పోలీసులు ఫ్రెంచ్ క్వార్టర్ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఆ ట్రక్‌లో దొరికిన పేలుడు పదార్ధాల వంటి మరిన్ని పేలుడు పదార్ధాలు వారికి లభించాయి. నిఘా కెమెరాల ఫుటేజీని బట్టి ఆ పేలుడు పదార్ధాలను ముగ్గురు వ్యక్తులు, ఒక మహిళ అమర్చారని తెలిసింది.
షంషుద్దీన్ జబ్బార్‌ను పోలీసులు ఎదుర్కొన్నప్పుడు అతను తన పికప్ ట్రక్‌లో నుంచి బైటకు వచ్చాడు. ఆ సమయంలో అతను బాలిస్టిక్ వెస్ట్, హెల్మెట్ ధరించి ఉన్నాడు.
న్యూ ఆర్లేన్స్ పోలీస్ సూపరింటెండెంట్ యాన్ కిర్క్‌పాట్రిక్ ఆ సంఘటన గురించి మాట్లాడుతూ ‘‘ఇది కేవలం ఉగ్రవాద సంఘటన కాదు, ఇది మహా దుర్మార్గం’’ అని వ్యాఖ్యానించారు.
షంషుద్దీన్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా ఎఫ్‌బిఐ తనిఖీ చేసింది. అందులో అతను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో తన అనుబంధాన్ని, ప్రజలను చంపేయాలన్న తన క్రూర ఆకాంక్షలనూ వ్యక్తం చేసాడు. నిజానికి ఆ వీడియోలు దాడికి చాలా సమయం ముందే అప్‌లోడ్ చేసినప్పటికీ, అతన్ని ఆపడానికి ఏ చర్యా తీసుకోలేదు.
షంషుద్దీన్ జబ్బార్ గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలిస్టుగా పనిచేసాడు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్‌గా కొంతకాలం పనిచేసాడు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరం నుంచీ అతను ఆన్‌లైన్‌లో ఆయుధాలు అమ్ముతుండేవాడు.
షంషుద్దీన్ జబ్బార్ 2007లో అమెరికా సైన్యంలో చేరాడు. ఎచ్ఆర్ అండ్ ఐటీ విభాగంలో పనిచేసాడు. తర్వాత 2009-2010 కాలంలో అతను అఫ్గానిస్తాన్ వెల్ళాడు. 2020లో అతను అమెరికన్ ఆర్మీ నుంచి స్టాఫ్ సార్జెంట్‌గా బైటకొచ్చాడు.
షంషుద్దీన్ జబ్బార్ ఓ దొంగతనం కేసులో 2002లో అరెస్ట్ అయాడు. 2005లోనూ లైసెన్స్ లేకుండా కారు డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. అప్పట్లో అతనికి వంద డాలర్ల జరిమానా మాత్రం విధించి వదిలేసారు. షంషుద్దీన్ జబ్బార్‌కు రెండుసార్లు పెళ్ళి అయింది. అతని రెండవ భార్య అతనికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పోరాడుతోంది.